Job Opportunities Abroad For Telangana Youth : స్థానిక ఏజెంట్‌ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాల్లో చాలామంది తెలంగాణ వాసులు దుర్భర జీవితాలు వెల్లదీస్తున్నారు. అక్కడ సరైనా పని, తిండి లేక నరకం అనుభవిస్తున్నారు. విదేశాల్లో ఉండలేక స్వదేశాలకు రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫారిన్‌లో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు తెలంగాణ విదేశీ మానవ వనరుల సంస్థ(టామ్‌కామ్) సువర్ణావకాశాలను కల్పిస్తూ ఆశాదీపంలా మారింది. రాష్ట్రంలోని జిల్లాల వారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. యూఏఈలో డెలివరీ బాయ్స్ జాబ్స్ కోసం ఈ నెల 17న కరీంనగర్‌లోని పురపాలక కార్యాలయం పక్కనున్న ఓ హోటల్‌లో ఈ మేళా నిర్వహిస్తోంది. దీనికి 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులు.
అసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పదో తరగతి మెమోతో పాటు పాస్‌పోర్టు, 3 ఏళ్ల క్రితం తీసిన డ్రైవింగ్ లైసెన్స్, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో మేళాకు హాజరు కావాలి. ఈ నియామక ప్రక్రియ దాదాపు 30 రోజుల్లో పూర్తి చేసి కేవలం మెడికల్ పరీక్షలకు డబ్బులు తీసుకొని విదేశాలకు పంపిస్తారు. ఉమ్మడి జిల్లావాసులు ఈ మేళాకు హాజరు కావచ్చు.
భాషపై శిక్షణ :విదేశాలకు వెళ్లే యువతకు హిందీ, ఆంగ్లంపైనే కాకుండా అక్కడి భాషపై అవగాహన ఉండాలి. ఇందుకోసం టామ్‌కామ్ ఆధ్వర్యంలో మన ప్రభుత్వమే ఆయా భాషలపై అభ్యర్థులకు ఉచిత శిక్షణను అందిస్తోంది. ఒప్పందం చేసుకొని దేశాల భాషా శిక్షణకు అభ్యర్థులే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మెరుగైన జీతభత్యాలు :విదేశాల్లో చేసే జాబ్‌లకు మెరుగైన వేతనాలు లభిస్తాయి. న్యాక్ సంస్థలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి జర్మనీలో నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలున్నాయి. రాష్ట్రం నుంచి అక్టోబరు మొదటి వారంలో 32 మంది జర్మనీ దేశానికి వెళ్లారు. వీరికి ఏడాది ట్రైనీలుగా నెలకు రూ.లక్ష వరకు మంచి వేతనం ఉంటుంది. పని బాగుంటే అదే సంస్థలో అవకాశం ఇస్తారు. అప్పుడు నెలకు రూ.2.80 లక్షల జీతం అందిస్తారు.