JEE Main-2025 West Godavari Students Allotted Exam Centers Against Preferred Choice : జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులకు లద్దాఖ్‌లోని కార్గిల్‌లో పరీక్ష కేంద్రం కేటాయించడంతో వారు ఆశ్చర్యపోయారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఇంటర్ చదువుతున్న కె.తేజచరణ్, పి.సాయిలోకేశ్ జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష కేంద్రాల వివరాలను ఇటీవల ఎన్‌టీఏ (జాతీయ పరీక్షల సంస్థ) విడుదల చేసింది.
ఈ క్రమంలో తమ పరీక్ష కేంద్రాల వివరాలను తేజచరణ్, సాయిలోకేశ్‌లు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. అందులో వారు ఐచ్ఛికంగా పెట్టుకున్న కేంద్రాలు కాకుండా ఈ నెల 29న జరిగే పేపర్-1 (బీటెక్)కు లద్దాఖ్‌లోని కార్గిల్‌లో కేంద్రాన్ని కేటాయించగా 30న నిర్వహించే (బీ ఆర్క్) పేపర్-2కు విశాఖపట్నంలో కేటాయించారు. వెంటనే విద్యార్థుల కుటుంబసభ్యులు ఎన్‌టీఏను సంప్రదించగా సరైన స్పందన రాలేదు. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏంచేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.