Nadendla Manohar Comments On YCP Govt: వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదన్న, ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తిప్పి కొట్టారు. వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. 2వేల కోట్లతో కొనుగోలు చేసిన 4లక్షలకు పైగా గేదెలు ఏమయ్యాయని నాదెండ్ల ప్రశ్నించారు.
ఆ శాఖలపై రెండు లక్షల ఫిర్యాదులు:అవినీతి పై ఫిర్యాదు చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 14400 కాల్ సెంటర్ కు 8లక్షల 3వేల 612 ఫిర్యాదులు వచ్చాయని నాదెండ్ల తెలిపారు. ఆ ఫిర్యాదుల్లో 2లక్షల 16వేల 803 ఫిర్యాదులు మంత్రులు, వారి పేషీలలో జరిగిన అవినీతిపై ఫిర్యాదులే అని ఆరోపించారు. 4లక్షల 39వేల ఫిర్యాదులు ఎమ్మెల్యేలపై వచ్చాయని చెప్పారు. వీటిలో ఒక్కటి కూడా రాలేదని చెప్పే ధైర్యం ముఖ్యమంత్రి జగన్ కు ఉందా అని నాదెండ్ల ప్రశ్నించారు.
రాష్ట్రంలో అవినీతి తాండవిస్తుంటే: జనసేన పార్టీ చేసిన ఆరోపణలు తప్పైతే ఆశాఖ అధికారులు మీడియా సమావేశం పెట్టి ఖండించాలన్నారు. ఏసీబీ శాఖకు అసలు డీజీ ఉన్నారా అని, సీఎం అడిగే పరిస్థితులు నెలకొన్నాయని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది కేవలం యాక్టింగ్ డీజీపీనే అని ఎద్దేవా చేశారు. అతనే ఏసీబీ డీజీగా కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి తాండవిస్తుంటే, సీఎం జగన్ మాత్రం తన ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని విమర్శించారు.