ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీడీపీపై పగ - పేదలపై కక్ష - సొంతింటి కలను పాతరేసిన జగన్ సర్కార్ - Jagananna Colonies Problems - JAGANANNA COLONIES PROBLEMS

Jagananna Colonies Beneficiaries Facing Problems: ఇళ్లు కాదు, ఊళ్లు నిర్మిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం అది కన్పించడం లేదు. కేంద్రం పట్టణ పేదలకు భారీగా ఇళ్లు మంజూరు చేస్తే, టీడీపీకి పేరు వస్తుందని వేల ఇళ్లను జగన్ సర్కార్ రద్దు చేసింది.

Jagananna_Colonies_Beneficiaries_Facing_Problems
Jagananna_Colonies_Beneficiaries_Facing_Problems

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 12:00 PM IST

Jagananna Colonies Beneficiaries Facing Problems:ప్రజలకు ఇళ్లు కట్టమంటే కాదు ఏకంగా ఊళ్లకు ఊళ్లే కడుతున్నామని సీఎం జగన్ మాటల కోటలు కట్టారు. నగరాలనే అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు పోయారు. అయితే వాస్తవానికి కేంద్రం పట్టణ పేదలకు భారీగా ఇళ్లు మంజూరు చేస్తే, టీడీపీకి పేరు వస్తుందని వేల ఇళ్లను రద్దు చేసిన దురాగతం వైసీపీది.

కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని వైసీపీ డబ్బా కొడుతోంది. మరోవైపు పేదలపై బ్యాంకుల రుణ వడ్డీభారం పెరిగిపోతోంది. ఇళ్లలో చేరకుండానే వాయిదాలు కట్టమని తాఖీదులు వస్తున్నాయి. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లనూ రద్దు చేస్తున్న దారుణమిది. పేదల సొంతింటి కలను పాతరేసి ఊసరవెల్లి మాదిరి టీడీపీ కట్టిన ఇళ్ల రంగులు మార్చి వికృతానందం పొందిన అరాచకమిది.

సమస్యలకు నిలయాలుగా జగనన్న కాలనీలు - కనీస వసతుల్లేకుండా ఎలా ఉండాలంటూ లబ్ధిదారుల ఆగ్రహం

కోట్ల రూపాయల నిధులు వృథా:ఒక టిడ్కో ఇంటికి కేంద్రం 1.50 లక్షలు రూపాయల సబ్సిడీ ఇస్తోంది. ఇళ్లను కట్టకపోవడంతో రూ.1,076 కోట్ల సబ్సిడీ పేదలు, మధ్యతరగతి కోల్పోయినట్లు అయింది. అఫర్డబుల్‌ హౌసింగ్‌ స్కీం(AHP) కింద 91,138 ఇళ్లు మంజూరవగా టీడీపీ పాలనలో 49,489 ఇళ్లు టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. దీనిలో 37,950 ఇళ్ల నిర్మాణం అప్పుడే చేపట్టారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది వరకు కట్టనేలేదు. రివర్స్‌ టెండర్‌లు పిలిచి కొన్ని అప్పగించారు. ప్రస్తుతం 19,376 టిడ్కో గృహాలు కట్టాలని నిర్ణయించారు. లబ్ధిదారుల జాబితాలనూ మార్చేశారు. విజయవాడ జక్కంపూడి కాలనీలో అయిదు దశల్లో దాదాపు 55 వేల ఇళ్లు కట్టాలనేది లక్ష్యం. ఇప్పుడు 6,576 మాత్రమే నిర్మిస్తున్నారు. గుడివాడలో 8,912 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చినా ఉండే పరిస్థితి లేదు. కొందరికి తాళాలూ ఇవ్వలేదు. జాబితాలు మార్చేసి వైసీపీ అనుకూలురకు కేటాయించారు.

మారుతున్న జాబితా:రేపో మాపో అని టిడ్కో గృహాలు పూర్తి చేయకుండా వదిలేశారు. కానీ రంగులు మార్చి వైసీపీ రంగులను వేసుకున్నారు. మరోవైపు పూర్తి చేసిన ఇళ్లను వైసీపీ మద్దతుదారులకు కేటాయిస్తూ టీడీపీ సానుభూతి లబ్ధిదారులను కత్తిరిస్తున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల వాటా రూ.50 వేలు చెల్లించినా వివిధ కారణాలతో జాబితా మారుస్తున్నారు. వైసీపీకి అనుకూలమైతే సరే, లేకపోతే ఇంటి కేటాయింపు కొంత ప్రశ్నార్థకమే. వెరసి లబ్ధిదారులు చెప్పుకోలేక అల్లాడుతున్నారు. మరోవైపు బ్యాంకు రుణాలు ఇవ్వమని మెలిక పెడుతున్నాయి. వయసు, డీఫాల్ట్‌, సిబిల్‌ స్కోరు గణించి బ్యాంకు రుణాలు మంజూరు చేస్తోంది. దీనికి ప్రభుత్వమే గ్యారెంటీ కావడంతో ఇవి చూడాల్సిన అవసరం లేదు.

లోతట్టు ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం - నీట మునిగిన కాలనీలు, అవస్థల్లో ప్రజలు

నిధులు లేవు:జిల్లాలో మూడు రకాల 300, 365, 430 చ.అ.విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. మొదటి లబ్ధిదారుని వాటా రూ.1.50 లక్షలు కేంద్రం, రాష్ట్రం రూ.3 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. రెండో రకానికి రూ.25 వేలు, మూడో రకానికి రూ.50 వేలు లబ్ధిదారు వాటా. బ్యాంకు రుణం రూ.3.15 లక్షలు, రూ.3.65 లక్షలు ఇస్తారు. కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన కింద అందుతుంది.

రాష్ట్రం నుంచి అంతే మొత్తం ఇవ్వాలి. జిల్లాలో బ్యాంకులు రూ.679.70 కోట్లు రుణం ఇస్తేనే టిడ్కో బ్లాకులు పూర్తయ్యేది. ఇప్పటికి రూ.370 కోట్లు ఇవ్వగా టిడ్కోకు నేరుగా అందుతున్నాయి. వీటి నుంచి గుత్త సంస్థలకు చెల్లిస్తున్నారు. లబ్ధిదారులతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటే రుణం మంజూరు చేసినట్లే. నాటి నుంచి రెండేళ్ల వరకు వాయిదాలు చెల్లించక్కర్లేదు.

బ్యాంకుల తాఖీదులు!:ఇళ్లే లేదు, రుణాలు చెల్లించాలని బ్యాంకులు తాఖీదులు ఇస్తున్నాయి. రుణాలే పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. కానీ వాయిదాలు చెల్లించాలని అంటున్నారు. ఒక్క గుడివాడలో మినహా ఎక్కడా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించలేదు. విజయవాడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత ప్రభుత్వం కట్టిన ఇళ్లకే నీలిరంగులు వేశారు తప్ప పూర్తయిన ఇళ్లకు వసతులు కల్పించి లబ్ధిదారులకు కేటాయించాలనే స్పృహ లేకపోయింది.రుణం మంజూరు చేసినప్పటి నుంచి రెండేళ్ల వరకు మారిటోరియం ఉంటుందని, తర్వాత ఇంటి నిర్మాణం పూర్తి కాకుంటే మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకుని ప్రభుత్వమే ఈ బకాయిలు చెల్లించాలి.

"జీ ప్లస్‌ త్రీ ఇల్లు మంజూరు చేయటంతో 2019లో రూ.50 వేలు డిపాజిట్‌గా చెల్లించా. అనంతరం ప్రభుత్వం మారాక ఇల్లు రద్దు చేశారు. ఇప్పటి వరకు డిపాజిట్‌ వెనక్కి ఇవ్వలేదు. ఎన్నిసార్లు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లినా సమాధానం చెప్పట్లేదు. " - చింతలపూడి లక్ష్మి, నందిగామ


"సొంత ఇల్లు వస్తుందని డబ్బులు చెల్లించి ఆరేళ్లవుతోంది. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు కేటాయించడానికి వైసీపీ ప్రభుత్వానికి అయిదేళ్ల సమయం సరిపోలేదు. ఏటా పెరుగుతున్న ఇంటి అద్దెలు, విద్యుత్తు ఛార్జీలతో జీవనం కష్టమవుతోంది. డబ్బులు కట్టామని సచివాలయ సిబ్బందిని అడిగితే తమకు సంబంధం లేదని తిరిగి ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు." - అన్నపూర్ణ, లేబరు కాలనీ

ABOUT THE AUTHOR

...view details