Jagan Government Neglects Inam Lands Issue:2019 ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే ఇనాం భూముల సమస్యలు పరిష్కరిస్తానని చిలకలూరిపేట వేదికగా జగన్ చిలుకపలుకులు పలికారు. ఇప్పుడు పదవీ కాలం ముగుస్తున్నా ఆ దిశగా అడుగు ముందుకువేయలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6వేల 700 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 4వేలు, ప్రకాశం జిల్లాలో 3,600ఎకరాలు నిషేధిత జాబితాలో చేరాయి. కృష్ణా జిల్లాలో 3,500, కడప జిల్లాలో 3,500, ఉభయగోదావరి 2,500, అనంతపురం 400, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 180 ఎకరాల్లో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. కొన్ని జిల్లాల్లోని ఇనాం భూముల్లో భవంతులు, దుకాణాలు వెలిసి ధరలు భారీగా పెరిగాయి.
తక్కువ వ్యవధిలో పరీక్షలకు సన్నద్ధత ఎలా? - ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల ఆగ్రహం
క్రయవిక్రయాలు స్తంభించి అవసరాలకు అమ్ముకోలేక వాటి యజమానులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండ వరాహ శ్రీలక్ష్మీనరసింహస్వామి, రామాయపట్నం జనార్దనస్వామి ఆలయాలకు చెందిన 1500ఎకరాలు నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. సోమరాజుపల్లి, సింగరాయకొండ గ్రామాల వరకు విస్తరించి ఉన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన భూములను ఏడు దశాబ్దాల క్రితం ఆలయ సేవకులకు కేటాయించారు. సీఆర్ కాలనీ, బోస్ రోడ్డు, సుబ్బయ్య తోట, బాలాజీ థియేటర్ తదితర ప్రాంతాల్లోని స్థలాలు నిషిద్ధ జాబితాలో చేరాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ పరిసర ప్రాంతాల్లోని రామలింగేశ్వరస్వామి, మదన గోపాలస్వామి ఆలయాలకు చెందిన వెయ్యి ఎకరాలు నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పాఠశాలలు, భవనాలు నిర్మించారు. జగ్గయ్యపేటలో శివాలయం, రంగనాయకుల దేవాలయాలకు చెందిన సుమారు 400 ఎకరాల భూములు నిషిద్ధ జాబితాలో చేరాయి. నిలిచిన క్రయ విక్రయాలతో తీవ్రంగా నష్టపోతున్నామని బాధితులు వాపోతున్నారు.