ITI Course Admission 2024 in TGSRTC Colleges :ఐటీఐ విద్యనభ్యసించే వారికి టీజీఎస్ ఆర్టీసీ సువర్ణవకాశం అందిస్తోంది. హైదరాబాద్, వరంగల్‌లోని టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్ https://iti.telangana.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలి అని సంస్థ సూచించింది.
రెండేళ్ల వ్యవధి శిక్షణా కాలంతో మోటార్ మెకానిక్ వెహికిల్(ఎమ్‌మమ్‌వీ), పెయింటర్ ట్రేడ్‌లు అందుబాటులో ఉండగా, ఏడాది కాలం పాటు కోర్సుల్లో మెకానిక్ డీజిల్, వెల్డర్ ప్రవేశాలు కల్పించనున్నారు. ఎమ్‌మమ్‌వీ, డీజిల్ మెకానిక్ ట్రేడ్‌లకు పదో తరగతి అర్హత కాగా, మిగతావాటికి ఎనిమిదో తరగతిని విద్యార్హతగా నిర్ణయించారు. లిమిటెడ్ సీట్లు ఉండటంతో ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ :స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు చక్కగా ఉపయోగపడతాయి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను సంస్థ ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవం గల ఆర్టీసీ అధికారులచే తరగతులను నిర్వహిస్తున్నారు.