Allegations in IRS Ramakrishna :గత ఐదేళ్లలో కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి వైఎస్సార్సీపీ పాపాల్లో భాగం పంచుకున్న అధికారుల్లో మరొకరు జారుకున్నారు. ఐఆర్‌ఎస్ అధికారి రామకృష్ణ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీగా అప్పట్లో ఆ విభాగమంతా తన సామ్రాజ్యం అన్నట్లు వ్యవహరించారు. అప్పటి పెద్దలు చెప్పినదానికల్లా తలూపి రిజిస్ట్రేషన్ల శాఖలో ఆయన చేసిన అక్రమాలపై ప్రాథమిక ఆధారాలుండటంతో కూటమి ప్రభుత్వం రామకృష్ణకి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది.
ఈ-స్టాంపింగ్ విధానం ప్రవేశపెట్టడంలోనూ రామకృష్ణ అవకతవకలకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో విజిలెన్స్ విచారణ జరిపించింది. విధి నిర్వహణలో ఆయన చేసిన అవకతవకలపై అభియోగాలు నమోదు చేయాల్సిందిగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇవన్నీ కొనసాగుతుండగానే రామకృష్ణ దర్జాగా మాతృశాఖకు వెళ్లిపోయారు. దిల్లీలో రిపోర్ట్ కూడా చేశారు.
IRS Ramakrishna Irregularities : ఆస్తుల క్రయవిక్రయ దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కి ఎప్పటి నుంచో నాన్-జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల విధానం అమల్లో ఉంది. దీనికి స్వస్తి పలికి దాని స్థానంలో ఈ-స్టాంపింగ్ విధానాన్ని వైఎస్సార్సీపీ సర్కార్ ప్రవేశపెట్టడంలో రామకృష్ణదే కీలకపాత్రనే ఆరోపణలున్నాయి. ఈ విధానం అమలుకు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునేవారి నుంచి వసూలు చేసే ఫీజుల మొత్తాన్ని అదే రోజు కాకుండా మర్నాడు జమ చేసేలా స్టాక్‌హోల్డింగ్ కార్పొరేషన్‌కు వెసులుబాటు కల్పించారు. అది ప్రభుత్వానికి నష్టదాయకమని ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.