PeddiReddy Irregularities in APMDC :గత ప్రభుత్వ హయాంలో ఖనిజాభివృద్ధి సంస్థను జేబు సంస్థగా వాడుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఇష్టానుసారం వ్యహరించారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సిఫార్సు ఉంటే చాలు అక్కడ ఉద్యోగం వచ్చినట్లే. ఇంటర్ చదివినా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇచ్చారంటే ఆ దందా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ కార్యకర్తలకు, సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసేవారికి, పెద్దిరెడ్డి ఆఫీసులో పనిచేసేవారికీ ఏపీఎండీసీ కొలువుల కామధేనువుగా మారింది.
వైఎస్సార్సీపీ పాలనలో ఏపీఎండీసీలో కాంట్రాక్ట్ విధానంలో 270 మంది, పొరుగుసేవల కింద 100 మందిని తీసుకున్నారు. మొత్తం 370 మందిలో నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ విధానంలో ఎంపికైనవారు కేవలం 13 మంది మాత్రమే ఉండటం గమనార్హం. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి గత ప్రభుత్వంలో ఏపీఎండీసీని శాసించారు. వీరు చెప్పినవారందరికీ అక్కడ ఉద్యోగాలిచ్చారు.
Frauds in APMDC : రామచంద్రారెడ్డి సిఫార్సులతో ఏకంగా 95 మందికి, ఎంపీ మిథున్‌రెడ్డి సిఫార్సుతో 45 మంది, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారని మరో 60 మందిని కొలువులో చేర్చుకున్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యేగా ఉన్న కొరముట్ల శ్రీనివాసుల సిఫార్సుతో మరో 25 మందికి ఉద్యోగాలిచ్చారు. గత సీఎం కార్యదర్శులు, ఓఎస్‌డీ, తదితరుల సిఫార్సులతో మరో 25 మందిని తీసుకున్నారు. అదానీ సంస్థ పీఆర్వోగా ఉంటూ, గత సీఎంఓలో తిష్ట వేసుకుని ఉండే పి.అంజిరెడ్డి సిఫార్సుతో ఇద్దరికి ఉద్యోగాలివ్వడం అరాచకానికి పరాకాష్ఠ.
మధ్యప్రదేశ్‌లోని సులియారీ బొగ్గు ప్రాజెక్ట్ మినహా గత ప్రభుత్వంలో ఏపీఎండీసీ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల్లేవు. సులియారీలో ఉత్తరాదికి చెందినవారిని నియమించుకున్నారు. అయినా సరే ఇక్కడి ఏపీఎండీసీకి అవసరమంటూ ఏకంగా 370 మంది ఉద్యోగులను నియమించుకొని ఐదు సంవత్సరాల పాటు పోషించారు. వీరిలో 70 మంది వరకు చీమకుర్తి గ్రానైట్ ప్రాజెక్ట్‌లో, మిగిలిన 300 మంది ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్లు చూపారు.