Liquor Quality Tests in AP :ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది. జగన్ పాలనలో ప్రవేశపెట్టిన జే బ్రాండ్లకి గుడ్ బై చెప్పింది. ఇంతే కాకుండా త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే నాణ్యమైన మద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వం నూతన ప్రామాణికాల్ని రూపొందించినట్టు ఆబ్కారీ, మద్యనిషేధశాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు.
ఇందుకోసం విభిన్న ప్రామాణికాలు నిర్దేశించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిషాంత్ కుమార్ వెల్లడించారు. గతంలో ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్‌ఏ) నమూనాలను ఆరు రకాల పారామీటర్స్ మేరకు పరీక్షించేవారని చెప్పారు. ఈ విధానాన్ని పూర్తిగా మార్చినట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, బ్లెండ్‌లను పరీక్షించడానికి ‘గ్యాస్ క్రొమటోగ్రఫీ’ అనే అత్యాధునిక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
New Parameters in Liquor Quality : విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, కాకినాడల్లోని రీజనల్ ప్రొబెషనరీ, ఎక్సైజ్ ల్యాబ్‌లలో ఈ పరీక్షలు అందుబాటులో ఉంటాయని నిషాంత్ కుమార్ వివరించారు. అన్ని రకాల బ్రాండ్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ఉండేలా పారామీటర్లను రూపొందించామని చెప్పారు. ఈఎన్‌ఏ పరీక్షించడానికి 13, బ్లెండ్ (విస్కీ, బ్రాందీ, వోడ్కా, జిన్) పరీక్షించడానికి తొమ్మిది పారా మీటర్లు నిర్ణయించామని నిషాంత్ కుమార్ పేర్కొన్నారు.