Interesting Discussion Between CBN and Niti Aayog Vice Chairman:సీఎం చంద్రబాబు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని సుమన్ భేరీ గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును కలిసిన సంగతులు సుమన్ బేరీ గుర్తు చేసుకున్నారు. గవర్నర్‌గా పని చేసిన రంగరాజన్‌తో కలిసి నాడు హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసిన అంశాలను సమన్ బేరీ ప్రస్తావించారు. దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నా సంస్కరణలు అనుకూలంగా మార్చుకుని ప్రజలకు మేలు చేసిన నాయకుడు చంద్రబాబే అంటూ ప్రశంసలు కురింపించారు.
వాజ్‌పేయి హయాంలో నాటి సంస్కరణలను అందిపుచ్చుకుని తీసుకువచ్చిన పాలసీలు ప్రజల జీవితాలు మార్చాయని సుమన్ బేరీ అన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ప్రతీ పాలసీ, ప్రతీ సంస్కరణ తరువాత కాలంలో దేశం పాటించిందని అన్నారు. ఐటీకి ప్రోత్సాహంతో పాటు ఎయిర్ పోర్టులు, ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లు, పీపీపీ పద్దతిలో రోడ్లు వంటి అనేక ఆవిష్కరణలకు నాంది పలికారంటూ సుమన్ బేరీ కితాబిచ్చారు. భవిష్యత్ అవసరాలను గుర్తించి ఆలోచనలు, పాలసీలు అమలు చేసే నాయకులతో ప్రజల జీవితాలు మారుతాయని అన్నారు.
సంస్కరణలకు అందిపుచ్చున్న ఫలితాలు ఉమ్మడి ఏపీలో కనిపించాయని సుమన్ బేరీ అన్నారు. ఇప్పుడు ఇండియా టైం వచ్చిందని ఈ సమయాన్ని దేశం 100 శాతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచ శక్తిగా ఎదగడానికి ఇప్పుడు వేగంగా అడుగు వేయకపోతే ఇక ఎప్పుడూ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో అన్ని అవకాశాలను అందుకుని దేశం ముందడుగు వేస్తుందని అభిప్రాయపడ్డారు.