INS Nirdeshak Commissioned: ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను కేంద్రమంత్రి సంజయ్‌సేథ్ జాతికి అంకితం చేశారు. విశాఖ నావల్ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నౌకను జాతికి అంకితం చేశారు. అత్యాధునిక హైడ్రో, ఓషనోగ్రాఫిక్ సర్వే పరికరాలతో నిర్దేశక్‌ను రూపొందించారు. 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఐఎన్‌ఎస్ నిర్దేశక్ సొంతమని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
రక్షణ రంగం ఉత్పత్తులలో భారత్ స్వయం సమృద్ది దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ తెలిపారు. దీనికి నిదర్శనం ప్రస్తుతం తయారయ్యే యుద్ధ నౌకలు 80 నుంచి 90 శాతం దేశీయ పరికరాలతో రూపుదిద్దుకుని మంచి పని తీరును కనబర్చడమేనని అన్నారు. రక్షణ అవసరాలకు అనుగుణంగా పరికరాలు, సామగ్రి సిద్ధం చేయడంలోనే కాకుండా ఉత్పత్తుల ఎగుమతులలోనూ మంచి పురోగతి సాధిస్తున్న పరిశ్రమ వర్గాలను, రక్షణవర్గాలను ప్రశంసించారు.
రెండు ఇంజన్లతో రూపకల్పన: కాగా సముద్ర జలాల్లో హైడ్రో గ్రాఫిక్ సర్వేలకు అనువుగా నిర్దేశక్ నౌకను రూపొందించారు. దీనిని నేడు జాతికి అంకితం చేశారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ విశాఖ నావెల్ డాక్ యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని దీనిని జాతికి అంకితమిచ్చారు. కోల్‌కతాలోనీ జీఆర్ఎస్ఈలో (Garden Reach Shipbuilders and Engineers) దేశీయంగా 80 శాతం పరికరాలతో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక నిర్మాణం జరిగింది. 110 మీటర్ల పొడవు, 3,800 టన్నుల బరువైన ఈ నౌకను రెండు ఇంజన్లతో రూపకల్పన చేశారు. అత్యాధునిక హైడ్రో గ్రాఫిక్, సముద్ర అధ్యయనం కోసం నిర్దేశక్‌ను తీర్చి దిద్దారు.
18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం: హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు సంబందించిన రెండో నౌక ఐఎన్‌ఎస్ నిర్దేశక్. గతంలో 32 ఏళ్ల పాటు భారత నౌకాదళంలో సేవలందించి, 2014వ సంవత్సరంలో వీడ్కోలు తీసుకున్న నిర్దేశక్ స్ధానంలో దీనిని రూపొందించారు. 25 రోజుల పాటు నిరంతరాయంగా 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించడం ఈనౌక ప్రత్యేకతలతో ఒకటి. హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం కోసం హైడ్రోగ్రాఫిక్ సర్వేలను చేపడుతుంది.