Indrakeeladri Durgamma Ashadam Sare Celebrations : విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వర్ణాభరణాలతో పసిడికాంతులు వెదజల్లే కనకదుర్గమ్మను ఆడపడుచుగా భావించి పిల్లపాపలతో భక్తులు సారెను తీసుకుని సన్నిధికి తరలివస్తున్నారు. శ్రీక్రోధి నామసంవత్సరం ఆషాడమాసాన్ని పురస్కరించుకుని ఈరోజు నుంచి వచ్చేనెల నాలుగో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వైదిక కమిటీ, అర్చకులు అమ్మవారికి ఆషాడ పవిత్రసారెను సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, వస్త్రాలు, చలిమిడి, పండ్లతోపాటు ఇతర సుమంగళ ద్రవ్యాలు, పదార్ధాలను తీసుకుని మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారికి ఆలయానికి చేరుకున్నారు.
గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం ఆఫీస్‌లో సీబీఐ సోదాలు - అదుపులో 8 మంది - CBI arrested Guntakal Railway DRM
ఆలయ ఈవో కె.ఎస్.రామరావు సతీసమేతంగా తొలిసారె తీసుకొచ్చిన పండితులు, వారి కుటుంబాలను సాదరంగా ఆహ్వానించారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని సుమంగళ ద్రవ్యాలను సమర్పించిన తర్వాత మల్లికార్జున మండపం ఆరో అంతస్తులుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద అమ్మవారికి తీసుకొచ్చిన సారెను అర్చకులు స్వీకరించి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ పండితులంతా అమ్మవారికి మంగళసూత్రాలను కానుకగా తయారు చేయించి ఈవో రామరావుకు అందించారు.
ఆషాడ సారె సమర్పణ కార్యక్రమంతోపాటు ఈరోజు నుంచే వారాహీ నవరాత్రులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈనెల 15వ తేదీ వరకు అమ్మవారికి పంచవారాహి మంత్రాలతో జపాలు, హోమాలు నిర్వహించనున్నారు. సస్యదేవతగా పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లిగా వారాహీమాతను ఆషాడమాసంలో పూజిస్తామని పండితులు తెలిపారు. చాలా శాంతస్వరూపిణి, కరుణారసమూర్తి అయిన వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుందనేది భక్తుల నమ్మకం.