Increasing Pollution Due to China Crackers :దీపావళికి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ప్రమాదకర చైనా మతాబులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వీటితో పాటు ఇక్కడ కూడా నాణ్యత లేని, అధిక కాలుష్యానికి కారణమయ్యే మందు గుండు సామగ్రిని విచ్చలవిడిగా, నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసి ప్రజల ప్రాణాలను లెక్క చేయడం లేదు. అందుకే ఏటా దీపావళికి ముందు, వెనక నాలుగైదు రోజులు సల్ఫర్, కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, జింక్, కాపర్, సోడియం, నైట్రోజన్ వంటి విష వాయువులు గాలిలో భారీగా కలుస్తున్నాయి.
కరోనా తర్వాత శ్వాస సంబంధిత వ్యాధుల బాధితులు భారీగా పెరిగారు. ఈ నేపథ్యంలో ఈ దీపావళిని పర్యావరణహితంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మసలుకోవాలని ప్రకృతి ప్రేమికులు, వైద్యులు కోరుతున్నారు. ఈ దీపావళిని పర్యావరణహితంగా నిర్వహించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. నూనె దీపాలు, క్యాండిల్స్, రకరకాల ఎల్‌ఈడీ లైట్లతో ఇళ్ల అలంకరణ వంటివి ఎక్కువ ఆనందం ఇస్తాయని సూచిస్తున్నారు.
దీపావళి సందర్భంగా నగరంలో పోలీసుల ఆంక్షలు - ఆ సమయాల్లో బాణాసంచా కాలిస్తే కఠిన చర్యలు
- ఏపీలోని ఉమ్మడి కృష్ణా సహా చుట్టుపక్కల జిల్లాల్లో భారీ ఎత్తున సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం అధికారులు ఏటా అనుమతి లేకుండా దేశంలోకి తీసుకొచ్చి విక్రయిస్తున్న చైనా పటాసులను పట్టుకుంటున్నారు. కానీ అధికారులు గుర్తిస్తున్నవి కేవలం 10 శాతం లోపే. మిగతా 90 శాతం దర్జాగా విక్రయిస్తున్నారు.
- తక్కువ ధర, పేలుడు భారీగా ఉండడంతో చైనా మతాబులను ఎక్కువగా కొంటున్నారు. కానీ వీటి వల్ల వెదజల్లే ప్రమాదకర రసాయనాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- విజయవాడ, బందరు నగరాల్లో ప్రతి సంవత్సరం దీపావళి వేడుకల తర్వాత కాలుష్య తీవ్రత నాలుగైదు రెట్లు పెరుగుతోంది. పండగ ముందు, తర్వాత గాలిలో కలిసి ఉండే పీఎం 10, పీఎం 2.5 శాతం ఎంతనేది కాలుష్య నియంత్రణ మండలి లెక్కిస్తుంది. రెండు నగరాల్లో సాధారణ రోజుల్లోనే ఉండాల్సిన స్థాయి కంటే అధికంగా ఉంటున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
- పీఎం 2.5 శాతం వందలోపు ఉండాలి. కానీ మామూలు రోజుల్లోనే ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో 150పైగా కాలుష్యం ఉంటోంది. దీపావళి తర్వాత చూస్తే ఏ ప్రాంతంలో చూసినా కనీసం 400 శాతంపైగా కాలుష్యం నమోదవుతుంది.
- దీపావళి మతాబుల వల్ల శబ్ద కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోంది. సాధారణ రోజుల్లో శబ్ద కాలుష్యం నివాస ప్రాంతాల్లో 50 డెసిబుల్స్, వాణిజ్య ప్రాంతాల్లో 75 డెసిబుల్స్ కంటే ఎక్కువ నమోదుకావొద్దు. కానీ దీపావళి రోజున ఇది అధికమవుతుంది.
- దీపావళి వేళ న్యాయస్థానం సూచించిన నిబంధనల ప్రకారం బాణసంచా శబ్దాలు 125 డెసిబుల్స్ దాటి ఉండొద్దు. కానీ దీనికి రెట్టింపు తీవ్రతతో దీపావళి రాత్రి శబ్దాలతో చెవి, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారి ప్రాణాలకు ముప్పుకు కారణమవుతున్నాయి.