Diarrhea Cases in Joint Anantapur District :ఉమ్మడి అనంతపురం జిల్లాలో అతిసార వ్యాధి లక్షణాలతో అనేక మంది మంచం పడుతున్నారు. ఐదేళ్లపాటు గ్రామీణ నీటి సరఫరా పథకాల నిర్వహణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. తాగునీటి ట్యాంకుల్ని శుభ్రం చేయలేదు. పైపులైన్ల లీకేజీని పట్టించుకోలేదు.! పైగా వర్షాలు కురవడంతో. గ్రామాల్లోని బోర్లలోకి నీరు చేరి కలుషితమవుతోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అతిసారం లక్షణాలతో ముగ్గురు మృత్యువాత పడ్డారు! అనేక మంది వాంతులు విరేచనాలతో అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Diarrhea Cases in AP : ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1600 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న శ్రీరామిరెడ్డి, శ్రీ సత్యసాయి తాగునీటి పథకాల నిర్వహణ తీసికట్టుగా మారింది. ఈ రెండు పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో తాగునీటి సరఫరా గాడితప్పింది! వేసవిలో తాగునీటి బోర్లు, దెబ్బతిన్న పైపులైన్ల మరమ్మతుల కోసం రూ.70 కోట్లు మంజూరు చేయాలని అనంతపురం జిల్లా ఎస్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. వైద్యారోగ్యశాఖ కూడా వర్షాకాలానికి ముందే ప్రజల్ని అప్రమత్తం చేయలేదు. ఇవన్నీ వెరసి ప్రజారోగ్యానికి శాపంగా మారాయి.
ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు :వాంతులు, విరేచనాలు ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. అతిసార రోగుల కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులోసుమారు 40 మంది చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఉరవకొండ చుట్టపక్కల మండలాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని వైద్యులు వివరించారు.