నాడు, నేడు పనుల్లో అంతులేని నిర్లక్ష్యం (ETV Bharat) Nadu Nedu School Works:నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేస్తామని ముఖ్యమంత్రి జగన్ గొప్పగా ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. మొదటి విడత పనులే అనేకచోట్ల పూర్తికాకపోగా రెండు, మూడు విడతల్లోనూ అదే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పాఠశాలల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యార్థులకు ఈ ఏడాది కూడా ఇబ్బందులు తప్పేలా లేవు.
ఏలూరు జిల్లాలో ఏ పాఠశాల చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో 57 అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఒక్కోదానికి 12లక్షల రూపాయల చొప్పున 6 కోట్ల 84 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. తొలుత ఒక్కో పాఠశాలకు మూడు నుంచి నాలుగు అదనపు తరగతులు మంజూరవ్వగా వీటిలో సగం కోత పెట్టారు.
ఏడాది దాటినా నిర్మాణాలు పూర్తికాలేదు. ఉంగుటూరు మండలం కైకరం, రాచూరు, నారాయణపురం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతుల భవనాలకు శ్లాబులు వేసిన తర్వాత పనులు నిలిపేశారు. ఉంగుటూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండేళ్ల క్రితం బాలికల జూనియర్ కళాశాల నిర్వాహణకు ఎంపిక చేసి మూడు అదనపు తరగతులు మంజూరు చేశారు. నేటికీ పునాది దశలోనే పనులు ఆగిపోయాయి.
వైసీపీ పాలనలో భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థ - పిల్లల బతుకులతో జగన్ సర్కారు ఆటలు - YCP Destroy The Education System
కాగుపాడు జడ్పీ ఉన్నతపాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. నిడమర్రు మండలం పెద్దనిండ్రకొలను జడ్పీ ఉన్నత పాఠశాలను హై స్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఇక్కడ నాలుగు అదనపు తరగతి గదులు మంజూరు కాగా ఒక గది పనులు కొలిక్కి వచ్చాయి. మిగిలిన మూడు గదుల నిర్మాణానికి నిధులు లేక అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండో విడతలో 17తరగతి గదులు నిర్మించాల్సి ఉండగా ఆరు గదులు మాత్రమే కడుతున్నారు. నిధుల సమస్యతో పనులు ముందుకు సాగడం లేదు. తరగతి గదుల కొరతతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జంగారెడ్డిగూడెంలోని ఇందిరానగర్ కాలనీలోని ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ఇసుక, సిమెంట్ కొరతతో పనులు నిలిచాయి. మంచినీటి ట్యాంకులు మంజూరైనా పునాదుల్లోనే ఆగిపోయాయి.
కైకలూరు మండలం సీతనపల్లి ఎంపీపీ పాఠశాల భవన నిర్మాణం శ్లాబు వరకు పూర్తయి ఆగిపోయింది. బిల్లులు రాకపోవడంతో పనులు అంసపూర్తిగా నిలిచిపోయాయి. బడులు తెరిచే నాటికి పూర్తి చేసే అవకాశం కనిపించడంలేదు. మండవల్లి మండలం చింతపాడు పాఠశాలలో 8 అదనపు తరగతి గదుల నిర్మాణం కోసమని ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభించగా ఇప్పటికీ మొదటి అంతస్తులోనే పనులు పూర్తి కాలేదు.
నిలిచిన నాడు-నేడు నిధులు - శిథిలావస్థకు రాళ్లపేట ప్రాథమిక పాఠశాల - RALLAPETA PRIMARY SCHOOL PROBLEMS