IIT Madras Team Visit Amaravati :రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిపుణుల బృందాలు పర్యటించాయి. ఐదేళ్లుగా ఎండకు, ఎండి వానకు తడిచిన నిర్మాణాలతో పాటు ఐదేళ్ల నుంచి పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న ఐకానిక్ టవర్ల ర్యాఫ్ట్ ఫౌండేషన్‌ను ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణుల బృందం పరిశీలించింది. సచివాలయం, హెచ్ఓడీ భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన ఫౌండేషన్ బేస్ మెంట్లను పరిశీలించారు. ఐఐటీ మద్రాస్‌లోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రోఫెసర్ మెహర్ ప్రసాద్, కొరోజన్ విభాగంలో నిపుణుడైన ప్రోఫెసర్ రాధాకృష్ణ పిళ్లై, ఫౌండేషన్, మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణుడు ప్రోఫెసర్ సుభాదీప్ బెనర్జీలు అమరావతిలోని ఈ భవనాలకు సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్‌ను పరిశీలించారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేసిన బోట్లలో నీట మునిగిన సచివాలయం, హెచ్ఓడీ ఐకానిక్ టవర్లకు చెందిన పిల్లర్లు, రాఫ్ట్ ఫౌండేషన్ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ వేసిన ప్రాంతం అంతా గడచిన ఐదేళ్లుగా పూర్తిగా నీటిలో మునిగి ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. ఈ ప్రాంతంలో దాదాపుగా 0.7 టీఎంసీల నీరు నిల్వ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం నీటిలో మునిగిపోయి ఉన్న రాఫ్ట్ పౌండేషన్, బేస్ మెంట్ల వద్ద నిర్మాణాల్లో వినియోగించిన ఇనుము పూర్తిగా తుప్పు బట్టిపోయిందని వాటి పటిష్టత పై సాంకేతికంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో నీట మునిగిన ప్రాంతాల్లో భూ సామర్థ్యపు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఐకానిక్ టవర్లు దాదాపు 40 నుంచి 46 అంతస్తులుగా నిర్మించాలని ప్రణాళిక చేసినందున ఆ మేరకు ఎంత భారాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతం మోయగలుగుతుందన్న దానిపై పరీక్షలు చేయాల్సి ఉందని తెలుస్తోంది.
'కట్టడాల సామర్థ్యం గురించి ఇప్పుడే చెప్పలేం' - ఐఐటీ నిపుణుల అభిప్రాయం - IIT Teams at Amaravati