Skill Census Survey in AP :ఏపీలో నైపుణ్య గణనలో అభ్యర్థుల నైపుణ్యాలను అక్కడికక్కడే అంచనా వేసేందుకు కొత్త ఐచ్ఛికాన్ని తీసుకొస్తున్నారు. చదువుకొని, ఉద్యోగం రాని వారి నైపుణ్యాలను తెలుసుకునేందుకు సర్వే యాప్‌లో కొత్తగా ఈ ఐచ్ఛికాన్ని పెట్టారు. దీన్ని ఇన్ఫోసిస్ కంపెనీ అభివృద్ధి చేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఉచితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇన్ఫోసిస్ సహకారం అందిస్తోంది.
మంగళగిరి నియోజకవర్గంలో తొలిసారి ప్రయోగాత్మకంగా నిర్వహించిన సర్వేలో ఇది లేదు. ఆ తర్వాత దీనిని పెట్టి, ప్రత్యేకంగా వివరాలు తీసుకున్నారు. అలా కాకుండా ఏపీ వ్యాప్తంగా చేసే సర్వే యాప్‌లో ఈ ఐచ్ఛికాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిరుద్యోగ యువత ఇంటికి వెళ్లిన సమయంలో వారు చదువుకున్న లేదా కోరుకుంటున్న రంగంలో ఉన్న నైపుణ్యాలను అంచనా వేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అభ్యర్థులను మూడు, నాలుగు ప్రశ్నలు అడిగి వారికి నైపుణ్య శిక్షణ అవసరమా? కాదా? అవసరమైతే ఎలాంటి శిక్షణ ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ ఐచ్ఛికం ఉపయోగపడనుంది. ఇన్ఫోసిస్ సంస్థ రూపొందించిన ఐచ్ఛికాన్ని మంగళ, బుధవారాల్లో నైపుణ్యాభివృద్ధి-శిక్షణ శాఖ అధికారులు పరిశీలిస్తారు. అవసరమైతే కొన్ని మార్పులు చేస్తారు.
కొత్త ఏడాదిలో సర్వే :ఏపీ వ్యాప్తంగా సర్వేను జనవరి రెండో వారం లేదా సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రయోగాత్మక సర్వే పూర్తి కావడంతో అక్కడ ఎదురైన అనుభవాలతో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. 60 పనిదినాల్లో సర్వేను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వే ఆలస్యం కావడంపై ఇటీవల కలెక్టర్ల సదస్సులో అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లోనే సర్వే పూర్తి చేస్తారనుకుంటే ఇంకా జాప్యం జరుగుతోందని అన్నారు. దీంతో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్వేను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.