Ed Questioned IAS Officer Amoy kumar : రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ అక్రమాల విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌ను ఇవాళ ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో వందల కోట్ల విలువైన 42ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా బదిలీ చేశారని ఆరోపణలు రావడంతో అప్పట్లో దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అక్రమాలపై నిజానిజాలను తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది.
దర్యాప్తులో భాగంగా ఆ సమయంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న అమోయ్ కుమార్ను విచారణకు రావాలని ఈడీ 4 రోజుల క్రితం నోటీసులు జారీచేసింది. ఈనెల 22 లేదా 23న విచారణకు రావాలని అందులో సూచించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 8గంటలకే న్యాయవాదితో కలిసి అమోయ్ కుమార్ బషీర్ బాగ్లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల పాటు దాదాపు విచారించారు.