Hydra Bangalore Tour Over:బెంగళూరు తరహాలో సహజ పద్దతుల్లోనే నగరంలోని చెరువులకు పునరుజ్జీవం కల్పించాలని హైడ్రా నిర్ణయించింది. 2025 నాటికి సుమారు 10 నుంచి 20 చెరువులకు పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ దిశగా బెంగళూరులోని ఉత్తమ విధానాలపై అధ్యయనం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవడ్ పర్యవేక్షణలో పునర్జీవం పోసుకున్న పలు చెరువులను స్వయంగా పరిశీలించారు. తక్కువ ఖర్చుతో మంచి సతల్ఫితాలను తీసుకొచ్చిన కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్మెంట్ అథారిటీకి అభినందనలు తెలిపారు. ఆనంద్ మల్లిగవడ్ సమక్షంలో హైదరాబాద్‌లోని పలు చెరువులను కూడా సహజ సిద్ధంగా పునరుద్దరించేందుకు కృషి చేయనున్నట్లు రంగనాథ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ మహానగరంలో చెరువుల పునరుద్దరణ, విపత్తుల నిర్వహణపై అధ్యయనం కోసం రెండు రోజులపాటు బెంగళూరు వెళ్లిన హైడ్రా బృందం పర్యటన ముగిసింది. కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలోని నలుగురు అధికారులతో కూడిన బృందం అక్కడి ఉత్తమ విధానాలను స్వయంగా పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. మొదటి రోజు ఎలహంకలోని కర్ణాటక నేచరుల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శించి అక్కడి సాంకేతిక పరిజ్ఞానం, వర్షాపాతం నమోదు, ఖచ్చితమైన సమాచారంతో ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడం లాంటి వివరాలను పరిశీలించారు.
బఫర్ జోన్స్‌లో ఉన్న భూమి ప్రభుత్వానిదే: సమీపంలోని ఎలహంక, జకూర్ చెరువులను పునరుద్ధరించిన తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్థానికుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో సమావేశమైన రంగనాథ్ నీటి వనరుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన కేటీసీడీఏ యాక్ట్ 2014ను పరిశీలించారు. ఎఫ్టీఎస్తో పాటు బఫర్ జోన్స్‌లో ఉన్న భూమి మొత్తం ప్రభుత్వ భూమిగా పరిగణిస్తున్నామని సీఈవో రాఘవన్ రంగనాథ్‌కు వివరించారు. అలాగే చెరువుల అభివృద్ధిలో డీపీఆర్‌లు రూపకల్పన, సాంకేతిక బృందం అధ్యయనం, క్షేత్ర స్థాయిలో చేపడుతున్న పనులను రాఘవన్ సమగ్రంగా వివరించారు. చెరువుల ఆక్రమణల తొలగింపులోనూ కేటీసీడీఏ అనుసరిస్తున్న విధానాలను కూడా రంగనాథ్ అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్ నగర సమస్యలపై హైడ్రా ఫోకస్ - వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే!