Balapur Laddu Auction 2024: గణేశుడి పండుగంటే గల్లీ నుంచి దిల్లీ వరకు మాములుగా ఉండదు. ఈ ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులోనూ వేలంలో రికార్డు స్థాయి ధరతో ప్రత్యేక గుర్తింపు పొందాడు బాలాపూర్ గణేశుడు. గతేడాది రూ.27 లక్షలు పలికిన ఈ లడ్డూను, ఈసారి రూ.30.1 లక్షలకు కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు.
Balapur Laddu Auction Winner Kolanu Shankar Reddy : పార్వతీ పుత్రుని చవితి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వాటిలో ఖైరతాబాద్ బడా గణేశుడితో పాటు బాలాపూర్ గణపతి యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. లక్షల్లో లడ్డూ వేలం పలుకుతూ అందరి దృష్టి ఆకర్షించే బాలాపూర్ గణనాథుని చరిత్ర ఎంతో ఘనంగా ఉంది. లడ్డూ కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనే నమ్మకం ఉండడంతో, ఈ ఏడాది సైతం రికార్డు స్థాయి ధర పలికింది. స్థానికుడు కొలను శంకర్ రెడ్డి, వేలం పాటలో రూ.30.1 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
బాలాపూర్ లడ్డూ దేశ ప్రధానికి అంకితం : బాలాపూర్ గణేశుడి లడ్డూ మరోసారి స్థానికులకే దక్కింది. లడ్డూ వేలం పాటను ప్రారంభించిన కొలను కుటుంబ సభ్యులు తొమ్మిదోసారి లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈసారి కొలను శంకర్ రెడ్డి రూ.30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూ ఛేజిక్కించుకున్నారు. ముగ్గురు స్థానికేతరులతో నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడిన శంకర్ రెడ్డి, గతేడాది కంటే రూ.3 లక్షల ఒక వెయ్యి రూపాయలు అధికంగా వేలం పాడి బాలాపూర్ లడ్డూ విజేతగా నిలిచారు.
చవితి వేడుకల్లో 40 ఏళ్ల కిందట లడ్డూ వేలం పాటను మొదలుపెట్టిన తమ కుటుంబానికి మరోసారి గణేశుడి ఆశీర్వాదం లభించడం పట్ల కొలను శంకర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. బాలాపూర్ లడ్డూను దేశ ప్రధాని మోదీకి అంకితం ఇస్తున్నట్లు శంకర్ రెడ్డి వెల్లడించారు. లడ్డూ వేలం పాటకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, మాజీ ఎమ్మెల్యే తీగల, మాజీ జడ్పీ ఛైర్మన్ అనితా హరినాథరెడ్డి, భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
బాలాపూర్ చరిత్ర - వేలం పాటకు రికార్డ్స్ బ్రేక్ :బాలాపూర్‌లో ప్రతిష్టించే విజ్ఞాధిపతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఘన చరిత్ర ఉంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే, వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బాలాపూర్‌లో తొలిసారిగా 1980లో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఉత్సవ నిర్వాహకులు 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. తొలి వేలం పాటలో రూ.450కి స్థానికుడు కొలను మోహన్‌రెడ్డి గెలుపొందారు.
పొందిన లడ్డూను కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. ఆ కుటుంబానికి, కొలను మోహన్‌రెడ్డికి ఆ ఏడాది అన్ని పనుల్లోనూ మంచి జరిగింది. లడ్డూ పొందడం ద్వారానే బాగా కలిసొచ్చిందని భావించిన మోహన్‌రెడ్డి, మరుసటి ఏడాది 1995లో మళ్లీ వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు. అప్పుడు వేలం ధర రూ.4,500. నేటితో ఆ ధరను పోలిస్తే రూ.లక్షకు పైగా ఉంటుంది. ఆ సంవత్సరం కూడా లడ్డూ పొందిన అతడికి అన్ని విధాలా కలిసొచ్చింది.
9సార్లు కొలను వంశస్తులకే ఆ మహా ప్రసాదం :ఇలా 1994లో రూ.450తో మొదలైన లడ్డూవేలం పాట, వందలు, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షలు పలుకుతోంది. 2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. 2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి రూ.1,05,000కు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది. 2007లో స్థానికుడు రఘునందనచారి 4,15,000 రూపాయలకు పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. 2015లో బాలాపూర్ లడ్డూ రూ.10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కల్లెం మదన్ మోహన్‌రెడ్డి రూ.10,32,000 లకు లడ్డూను దక్కించుకున్నారు. కాగా ఇప్పటివరకు జరిగిన బాలాపూర్ వేలంలో అత్యధికంగా 8 సార్లు కొలను వంశస్తులే దక్కించుకోవటం గమనార్హం. గతేడాది 2023లో రూ.27 లక్షలకు లడ్డూ వేలం ధర పలకగా, ఈసారి అంచనాలకు తగ్గట్టు రూ.30.01 లక్షలకు కొలను కుంటుంబం మళ్లీ లడ్డూను దక్కించుకుంది. దీంతో తొమ్మిది సార్లు కొలను కుటుంబమే ఆ మహా ప్రసాదాన్ని దక్కించుకున్నట్లైంది.