How to Possible Tirumala Darshan in Two Hours: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని దర్శనార్థం నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఇందు కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, 10 వేల 500 రూపాయల ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ దర్శనం, సర్వదర్శనం అని పలు రకాలుగా ఉన్నాయి. అయితే భక్తుల్లో అత్యధికులు సామాన్య భక్తులు ఉంటున్నారు. దీంతో సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. మరి ఇంత తక్కువ సమయంలో దర్శనం ఎలా అనే దానిపై సాధ్యాసాధ్యాలను ప్రస్తుతం చూద్దాం.
- రద్దీ ఉన్న సమయాల్లో వైకుంఠం రెండో క్యూకాంప్లెక్స్‌లోనే దాదాపు 30 గంటల పాటు శ్రీవారి దర్శనం కోసం వేచిచూడాల్సి వస్తోంది.
- స్లాట్ దర్శనం అంటే శ్రీనివాసం, విష్ణునివాసంలో ఆధార్ కార్డు ద్వారా దర్శన టైమింగ్ కేటాయిస్తారు. దీంతో 2, 3 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది.
- అయితే ఈ టికెట్లు పరిమితం గానే ఉంటాయి. అదే విధంగా అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి కాలి నడకన వచ్చే భక్తులకు గతంలో దివ్యదర్శనం పేరుతో కొన్ని టికెట్లను కేటాయించేవారు. ఇలా కూడా 2, 3 గంటల్లోనే దర్శనం పూర్తయ్యేది.
- అయితే గత ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది.
ఇకపై ఆ టికెట్లు రద్దు - రెండు గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం - టీటీడీ సంచలన నిర్ణయాలు
‘కంకణం’ విధానం తీసుకొస్తారా?:
- రెండు దశాబ్దాల క్రితం ఐవీ సుబ్బారావు టీటీడీ ఈవోగా ఉన్న సమయంలో కంకణాలను ప్రవేశపెట్టారు.
- దీని ప్రకారం ప్రతి భక్తుడి చేతికి రిస్ట్ బ్యాండ్ తరహాలో ఒక కంకణాన్ని వేస్తారు. ఈ కంకణం వాటర్ ప్రూఫ్‌లా ఉంటుంది.
- ఈ కంకణాన్ని తిరుపతిలోని అనేక కేంద్రాలతో పాటు రేణిగుంట తదితర ప్రాంతాల్లో వేసేవారు. ఈ విధానంతో భక్తులకు కేటాయించిన సమయానికి వెళ్తే, రెండు, మూడు గంటల్లో దర్శనం పూర్తవుతుంది.
- ఛైర్మన్ బీఆర్ నాయుడు గతంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీన్నే తిరిగి అమలు చేసే అవకాశముంది.