Environmental Friendly Diwali: జీవితానికి జిలుగులు, దీపావళి వెలుగులు. దీపావళి దీపాల అంతరార్ధం ఇదే. పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూతత్వానికీ, వత్తి ఆకాశతత్వానికీ, తైలం జలతత్వానికీ, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికీ, జ్యోతి అగ్ని తత్వానికీ ప్రతీకలు. పంచభూతాల సమాహారమే- మనిషి శరీరం. అందుకే దీపాన్ని వెలిగించడమంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమేననేది పురాణ వచనం. వెలుగుల పండుగ దీపావళిని కులమతాలకు అతీతంగా అంతా చేసుకుంటారు.
ప్రతి ఒక్కరి మోములో సంతోషాలు వెళ్లివిరిసే ఈ తరుణంలో పండగ పేరుతో కాల్చే టపాసుల వల్ల పంచభూతాలు కాలుష్య కోరల్లోకి వెళ్తున్నాయి. మన సరదాల కోసం అద్భుతమైన వేడుకను పర్యావరణానికి శత్రువుగా మార్చేస్తున్నాం. ఆరునెలల్లో వచ్చే కాలుష్యాన్ని ఒక్క రాత్రిలోనే ప్రకృతికి అంటిస్తున్నాం. చేతులారా ఉపద్రవాల్ని స్వాగతిస్తున్నాం. హానికరమైన టపాసుల జోలికిపోకుండా దశాబ్దాలుగా దీపాల కాంతులతోనే ఈ పండుగను సంతోషంగా చేసుకుంటున్నాం అంటున్నారు కృష్ణా జిల్లా గూడవల్లికి చెందిన పొట్లూరి సాంబశివరావు కుటుంబీకులు, సన్నిహితులు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? - లక్ష్మీ పూజ ఈ విధంగా చేస్తే సంవత్సమంతా అష్టైశ్వర్యాలు!
హరిత దీపావళి చేసుకొని ఆనందంగా ఉందాం: బాణసంచా కాల్చడం వల్ల పొందే సంతోషం క్షణకాలమే. తాత్కాలిక ఆనందమే కాదు ఆర్ధిక స్థితిగతులు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడం అందరి బాధ్యత. ఈ క్రమంలో నిరాడంబరంగా హరిత దీపావళి చేసుకొని ఆనందంగా ఉందామంటున్నారు కృష్ణా జిల్లా గూడవల్లికి చెందిన పొట్లూరి సాంబశివరావు కుటుంబీకులు. మాటల్లో కాదు చేతల్లో దశాబ్దాలుగా చేసి చూపిస్తున్నారు. తమ లోగిలే కాదు, తమ బంధుమిత్రుల లోగిళ్లలోనూ ఈ తరహా ఆనందం ఉండేలా వారిలోనూ చైతన్యం తీసుకొస్తున్నారు. అంతా కలిసికట్టుగా అందమైన రంగవళ్లులు, పుష్పాల అలంకరణల నడుమ దీపాల వెలుగులతో ప్రకృతి కాంతను పరవశించేలా చేస్తున్నారు. సృష్టి, స్థితి, లయలకు ఉండే సన్నిహితమైన సంబంధమే దీపం. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీలవర్ణం విష్ణువుకు, తెల్ల రంగు శివునకు, ఎర్ర రంగు బ్రహ్మకు సంకేతాలంటారు పండితులు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే సరస్వతి, దుర్గ, లక్ష్మీ ఆ కాంతిలో కొలువై ఉంటారన్నది పెద్దల మాట.