Hyderabad Honey Trap : మగాడి బలహీనతను పట్టుకొని వయ్యారీ కిలేడీలు పెళ్లి కాని ప్రసాద్‌లను, నచ్చిన మగువతో సరదాగా గడపాలనుకునే పురుషోత్తములకు వలపు వల విసురుతున్నారు. ఆన్లైన్ వివాహ పరిచయ వేదికలు, డేటింగ్ యాప్‌లు, పబ్‌లు, రేవ్ పార్టీలు, సామాజిక మాధ్యమాలు వంటి వాటి ద్వారా తేలిగ్గా బురిడీ కొట్టిస్తున్నారు. సదరు మగాడు బుక్కయ్యామని గుర్తించేలోపే దొరికినంత సొమ్మును గుంజి ఉడాయిస్తున్నారు. ఇలాంటి విషయాలు బయటకు వస్తే ఇంకేముంది.. అలాగే ఇంట్లో తెలిస్తే కాపురాలకు కాపురాలే నడి ఏట్లో కొట్టుకుపోతుంది. అందుకే పరువు పోతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉండిపోతున్నారు.
నగరంలోని ఎక్కువ మంది మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాప్‌లు ద్వారానే మోసపోతున్నట్లు పోలీసులు గుర్తించి హెచ్చరిస్తున్నారు. అయినా వలపు వల విసిరిన కిలోడి కొంగుకు ముడై అడ్డంగా బుక్కయై.. జేబులు గుల్ల చేసుకుంటున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడే ఇటువంటి ఆగడాలను అదుపు చేయగలమని పోలీసులు సూచిస్తున్నారు.
నమ్మారో ఇక మీ పని గోవింద :మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్ ఉంచి అబ్బాయిలను పెళ్లి పేరిట మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వివాహ పరిచయ వేదికల్లో పరిచయమైన యువకుల ఫోన్ నంబర్లు తీసుకునేవారు.. ఇద్దరు యువతులకు కమీషన్ ఇస్తామని ఆశచూపి వారినే వధువులుగా పరిచయం చేసేవారు. ఇలా పరిచయం అయిన తర్వాత పుట్టిన రోజు బహుమతులు, పేరెంట్స్ ఆసుపత్రిలో ఉన్నారంటే జేబులు ఖాళీ చేసేవారు.
పెళ్లి ప్రస్తావన వస్తే మాత్రం ముఖం చాటేసేవారు.. అలాగని గట్టిగా నిలదీస్తే లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించేవారు. ఇలా సుమారు 50 మంది వరకు మోసపోయారు. బాధితుల జాబితాలో మల్టీఫ్లెక్స్ యజమాని, విశ్రాంత ఐఏఎస్ అధికారి, సినీ నిర్మాత సైతం ఉన్నారు. మరో యువతి ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో ఒక యువతి మాజీ ప్రేమికుడి కారులో డ్రగ్స్ ఉంచి పోలీసులకు పట్టించిన ఘటన ఉంది. అతడిని వదిలించుకునేందుకే మాయలేడి ఇలా చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. అర్ధరాత్రి దాటాక వాట్సాప్ వీడియోకాల్ చేసి సెక్స్ టార్షన్తో బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి నరకం సృష్టిస్తున్నారు.
వారంతా ఎవరో తెలుసా :ఉద్యోగం కోసం ఎంతో మంది యువతులు భాగ్యనగరానికి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ఎన్నో ఇబ్బందులు పడతారు. వచ్చే జీతం సరిపోక పిల్లల ఫీజులకు, ఖర్చులకు కిరాయి మనుషుల్లా మారుతున్నారు. గత నెలలోనే బంజారాహిల్స్ పబ్‌లో పట్టుబడిన 42 మంది మహిళలల్లో నలుగురు గృహిణలు. వారిలో ఒక మహిళ తన 4 నెలల కుమార్తె కోసం ఇలాంటి పనులు చేస్తున్నట్లు చెప్పింది. భర్త ఆదరణకు దూరమై ఆమె ఆర్థిక ఇబ్బందులు పడుతోంది. దీంతో చేసేదేమీ లేక పబ్ నిర్వాహకులు ఇచ్చే రూ.2 వేల కోసం మగవారితో మాటలు కలిపి బిల్లులు పెరిగేలా చేసేందుకు అంగీకరించినట్లు తెలిపింది. అలాగే ఉత్తరాది నుంచి వచ్చిన మరో యువతి స్పా సెంటర్లో పని చేస్తూ వచ్చిన జీతం రూం రెంట్లు, ఖర్చులకే సరిపోగా.. ఇంటికి డబ్బులు పంపించడానికి ఇలా చేస్తున్నానంటూ చెప్పింది.
డేటింగ్ పేరుతో చీటింగ్- అందమైన యువతుల ఫొటోలతో అమెరికన్ యువకులకు ఎర - HYD Police Arrest Online Fraudster
హెచ్చరిక : ఈ ప్రేమలు చాలా డేంజర్ సుమీ! - పసిగట్టకపోతే మోసపోవడం గ్యారెంటీ! - How to avoid Toxic Dating Trends