High Court Hearing on Raghurami Reddy Letter:విజిలెన్స్‌కు విస్తృత అధికారాలు కల్పించాలనే పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని ఏ కార్యాలయాల్లో అయినా ప్రవేశించి తనిఖీలు, జప్తులు, సమాచార సేకరణ, తదితర విషయాల్లో విస్తృతాధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అప్పటి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 5న లేఖ రాశారు. ఆ లేఖను సవాలు చేస్తూ మంత్రి నారా లోకేశ్ మార్చి 13న వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేసిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి జులై 8కి వాయిదా వేశారు. న్యాయవాది అఖిల్‌చౌదరి వాదనలు వినిపించారు.
'వాలంటీర్ల రాజీనామా'- కౌంటర్ దాఖలుపై హైకోర్టు ఆదేశాలు - HC on Volunteers Resign Petition
రాష్ట్రంలోని ఏ కార్యాలయానికైనా వెళ్లి ఏకపక్షంగా తనిఖీలు, జప్తులు, వారెంట్ లేకుండా అరెస్టులు వంటి విషయాల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారులు అందరికీ అపరిమిత అధికారాలు కోరుతూ ప్రభుత్వానికి రఘురామిరెడ్డి రాసిన లేఖను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఆ లేఖను ఆధారం చేసుకుని ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలను నిలువరించాలని మంత్రి లోకేశ్ పిటిషన్‌లో కోరారు. ఎన్నికల్లో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసుల్లో ఇరికించాలన్న ఏకైక ఉద్దేశంతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అక్రమ అధికారాన్ని కట్టబెట్టబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు అనుమతివ్వడం అనేది టీడీపీ నేతల హక్కులను హరించడమేనని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.