High Court Dismissed Appeal on Group 1 Postpone :రాష్ట్రంలో ఈనెల 9న జరగనున్న గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. అన్ని ఏర్పాట్లు పూర్తయి అదివారం జరగనున్న పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంది. కేవలం కొందరి కోసం ఎక్కువమంది ప్రయోజనాలు దెబ్బతినేలా ఉత్తర్వులు జారీ చేయలేమంది. గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదాకు సింగిల్ జడ్జి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీలును హైకోర్టు కొట్టివేసింది.
జూన్ 9వ తేదీన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేసేలా ఆదేశించాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం గణేశ్, హనుమకొండకు చెందిన భూక్యా భరత్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారించిన సింగిల్ జడ్జి పిటిషన్ కొట్టివేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ గణేశ్, భరత్‌లు అప్పీలు దాఖలు చేశారు.
HC Rejects Group 1 Candidates Petition : దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రెండు పరీక్షలు ఒకే రోజు జరుగుతున్నందున ఒక ఎగ్జామ్‌కు అటెండ్ కాలేకపోతున్నట్లు తెలిపారు. పరీక్షను వాయిదా వేసినట్లయితే నిరుద్యోగులకు కొంత ఊరట లభిస్తుందన్నారు.