Hens in Tirumala Cottages:గోవిందనామ స్మరణతో మారుమోగాల్సిన తిరుమలలో ఏకంగా కోళ్లను పెంచారు ఓ డీఎస్పీ. అంతే కాకుండా వాటి రక్షణ బాధ్యతను కానిస్టేబుళ్లకు అప్పగించారు. ఆ అధికారి పేరు టీటీ ప్రభాకర్‌బాబు. ఏపీ పోలీసు శాఖలో ప్రస్తుతం ఏఎస్పీ హోదాలో టీటీ ప్రభాకర్‌బాబు పని చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో 2019 ఆగస్టు 10 నుంచి 2020 నవంబరు 30వ తేదీ వరకు తిరుమల డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన చేసిన పనులపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చర్యలకు సిద్ధమైంది. ఆయనపై పలు అభియోగాలు మోపింది.
టీటీడీ కేటాయించిన వసతి గృహంలో నివసించిన ప్రభాకర్‌బాబు అందులో ఏకంగా కోడిపుంజులను పెంచారు. దీని కారణంగా ఆ వసతి గృహంలోని భక్తులు, యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కాటేజీల మధ్యలోనే కోళ్లు ఉండటంతో రాత్రివేళ వాటి అరుపులు, శబ్దాలు, విసర్జితాల దుర్వాసనకు యాత్రికులకు సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. ఆ కోళ్లకు ఆహారం పెట్టడం, స్నానం చేయించడం వంటి పనులను కానిస్టేబుళ్లకు అప్పగించారు. ప్రభాకర్‌బాబు ప్రవర్తనతో మానసికంగా పలువురు పోలీసు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బాబోయ్ మేము ఇక్కడ పని చేయలేమని, మమ్మల్ని వేరే చోటకు పంపించాలంటూ అభ్యర్థించుకున్నారు. దీంతో అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు అనేది ప్రభుత్వం మోపిన అభియోగాల సారాంశం. ప్రభాకర్‌బాబుపై మొత్తం 7 అభియోగాలు నమోదు చేసిన ప్రభుత్వం, వాటన్నింటికీ 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదంటే నేరుగా అయినా హాజరై సమాధానాలివ్వాలని ఆదేశాలలో పేర్కొంది. గడువులోగా సమాధానాలు ఇవ్వకపోతే తమ వద్దనున్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.