Heavy Rains in Uttarandra District : అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేని వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. గోపాలపట్నం, రామకృష్ణనగర్ మార్గంలో కొండచరియలు విరిగి 5 ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. ఎమ్మెల్యే గణబాబు అక్కడ నివాసితులను అప్రమతం చేసి సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించారు. వర్షాలకు ఆనందపురం హైస్కూల్ ప్రహరీ గోడ కూలి రెండు ద్విచక్రవాహనాలు, ఒక రిక్షా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు పరిహారం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
వర్షానికి రోడ్లు జలమయం :అనకాపల్లి జిల్లా చోడవరంలోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. పెద్దేరు నది ఉద్ధృతికి 64 ఎకరాల్లో వరి పొలం నీటి మునిగింది. నర్సీపట్నం-చోడవరం మార్గంలో విజయరామరాజుపేట వద్ద డైవర్షన్ వంతెన కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్లూరి జిల్లా డొంకరాయి జలాశయానికి ఎగువ నుంచి వరద ఉద్ధృతంగా రావడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జోలాపూట్టు జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. నీటిని దిగువన ఉన్న డుడుమ జలాశయానికి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద వస్తుండడంతో డుడుమ జలాశయం నాలుగు గేట్లు ఎత్తి బలిమెలకు విడుదల చేశారు.
పూర్తిస్థాయి నీటిమట్టానికి జలాశయాలు :ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకున్నాయి. వేగావతి, సువర్ణముఖి నదుల ద్వారా 13 వేల క్యూసెక్కుల నీరు మడ్డువలస జలాశయానికి చేరుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు 8 గేట్లు ఎత్తి నాగావళి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. తాటిపూడి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 297 అడుగులు కాగా ప్రస్తుతం 295.50 అడుగులకు చేరింది. రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సంతకవిటి మండలం రంగారాయపురం నారాయణ పురం ఆనకట్ట వద్ద 60 వేల క్యూసెక్కుల నీరు చేరుతోందని అధికారులు తెలిపారు.