Heavy rains in Uttarandhra:ఉమ్మడి విశాఖ జిల్లాలో వర్షం దంచికొడుతోంది. భారీ వర్షం వల్ల అనకాపల్లి జిల్లా కోటవురట్లలో వ్యవసాయ సహకారబ్యాంకు జలదిగ్బంధమైంది. ప్రధాన రహదారితోపాటు సమీపంలోని ఇళ్లు నీటమునిగాయి. నర్సీపట్నం మండలం వేములపూడి వద్ద ఏలేరు కాలువ 82వ కిలోమీటరు సమీపంలో కాలువ లైనింగ్‌ను మించి నీటి ప్రవావం కొనసాగుతోంది. గండిపడే ప్రమాదం ఉండడంతో రైతులే స్వయంగా మట్టి బస్తాలు మోసుకొచ్చి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.
సీలేరు జలాశయానికి వరద పోటెత్తింది. సీలేరు జలాశయంలోని నాలుగు గేట్లు ఎత్తి 13వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పిల్లిగెడ్డ వంతెన కొట్టుకుపోయింది. ఫలితంగా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు నిలిచాయి. డొంకరాయి జలాశయం నుంచి లక్షా 10వేల క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉపమాక సమీపంలోని జగనన్న కాలనీ ముంపునకు గురైంది. మోకాళ్లు లోతు నీరు రావడంతో బయటకు రాలేక స్థానికులు అవస్థలు పడుతున్నారు.
చోడవరం నియోజకవర్గంలో వాగులు, గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. రావికమతం మండలం కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. జలాశయం నాలుగు గేట్లు ఎత్తి వరద నీటిని వరాహా నదిలోకి విడుదల చేస్తున్నారు. కోనాం జలాశయం, పెద్దేరు జాలశయం నుంచి 1860 క్యూసెక్కుల వరదనీరు దిగువకు అధికారులు వదలడంతో బొడ్డేరు, పెద్దేరు నదులు నీటి ప్రవాహం అధికంగా ఉంది దీంతో వందలాది ఎకరాలలో నాటిన వరి, చెరకు పంటలు ముంపుకు గురయ్యాయి. రాష్ట్ర రహదారైన భీమిలి - నర్సీపట్నం రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. బుచ్చయ్య పేట మండలం విజయరామరాజు పేట వద్ద తాచేరు నది నీటి ప్రవాహం ఉధృతికి తాత్కాలిక డైవర్షన్ కల్వర్టు ధ్వంసమైంది.