Heavy Rains in Combined Krishna and Guntur Districts:ఎడతెరిపి లేని వర్షాలతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా నందిగామ, తిరువూరు జిల్లాల్లో వాగులు, వంకలు ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ముంచెత్తిన వరద నీటితో పంటలకూ పెద్దఎత్తున నష్టం వాటిల్లింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. వర్షాల ధాటికి నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కాజ్ వే మీదుగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో నందిగామ, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. నల్లవాగు, కూచి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరు వాగుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చందర్లపాడు పాటింపాడు మధ్య ఉన్న రహదారిపై గుర్రాల వాగు పొంగి ప్రవహిస్తుండగా వాహనాల రాకపోకలు నిలిపేశారు. ఎవరు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం - బాధితులకు అండగా ఉంటాం: మంత్రులు - Ministerial Reviews on Rains