ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఉన్నాయా? - వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే! - HEALTH DEPT ON HMPV CASES

రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు లేవన్న వైద్యారోగ్య శాఖ - వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచన

Health Dept on HMPV Cases
Health Dept on HMPV Cases (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2025, 6:29 PM IST

Health Dept on HMPV Cases: చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (Human Metapneumovirus) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి స్పష్టం చేశారు. ఈ వైరస్ గురించి ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. న్యూమో విరిలే కుటుంబానికి చెందిన ఈ వైరస్ కరోనా వైరస్ తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని ఆమె తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.

వైరస్ లక్షణాలు: వైరస్ సోకిన వారి దగ్గు, తుమ్ముల వల్ల వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని ఆమె వివరించారు. పాత్రలపై వైరస్ ఉన్నట్లయితే, తాకిన తరువాత అదే చేతితో నోరు, ముక్కు, కళ్లను తాకటం ద్వారా మన శరీరంలోకి ఈ వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు నిర్ధారించినట్లు ఆమె పేర్కొన్నారు. వైరస్ సోకిన తరువాత వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజులలోగా బయటపడతాయన్నారు.

హెచ్ఎంపీవీ సోకిన వారికి సాధారణ జలుబు (ఫ్లూ) లాంటి లక్షణాలు ఉంటాయన్నారు. దగ్గు, ముక్కు దిబ్బెడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తాయని ఆమె తెలిపారు. కొన్నిసార్లు న్యూమోనియా, బ్రాంకైటిస్ (ఆస్తమా) వంటి శ్వాసకోశ సమస్యలకు కూడా ఇది దారి తీస్తుందన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుందన్నారు.

చైనా కొత్త వైరస్​ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? నివారణ ఎలా? చికిత్స ఏదైనా ఉందా?

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కోవిడ్ సమయంలో పాటించిన తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. 20 సెకన్లపాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, దగ్గినపుడు, తుమ్మినపుడు, నోటిని, ముక్కుని చేతిరుమాలుతో అడ్డు పెట్టుకోవాలన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, వాడిన వస్తువులను ఇతరులతో పంచుకోకుండా ఉండటం వంటి చర్యలతో పాటు తగినంత పౌష్టికాహారం, మంచినీరు తీసుకోవాలని, తగినంత నిద్ర పోవాలని సూచించారు.

వైరస్ లక్షణాలు కన్పించిన వారు క్వారంటైన్​లో ఉండటం మంచిదని ఆమె తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తులు లేదా లక్షణాలు కన్పిస్తున్న వ్యక్తులు ఇతరులతో కరచాలనం చేయరాదని, ఉపయోగించిన టవల్స్, రుమాళ్ల వంటి వాటిని మళ్లీ వాడరాదని, చేతులతో తరచు కళ్లు, ముక్కు, నోటిని తాకరాదని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయరాదని సూచించారు. అదే విధంగా వైరస్ లక్షణాలున్న వ్యక్తులకు సమీపంగా ఇతరులు ఉండకూడదన్నారు. వైరస్ సోకినట్లు అనుమానం ఉన్న వారు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని, ఎటువంటి సొంత వైద్య చేసుకోకూడదని ఆమె సూచించారు.

నిర్దిష్టమైన చికిత్స లేదు:ఇప్పటి వరకూ హెచ్ఎంపీవీకి నిర్దిష్టమైన యాంటీ వైరల్ చికిత్స అనేది లేదన్నారు. వ్యాక్సిన్లు కూడా అభివృద్ధి చేయలేదన్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం నొప్పి నివారణ మందులు, ఆక్సిజన్ తెరపీ వంటివి ఇవ్వటం జరుగుతోందన్నారు. వైరస్ తీవ్రతకు ఎక్కువగా గురయ్యే చిన్న పిల్లలు, వృద్ధులకు ప్రభుత్వ ఆస్పత్రులలో తగిన చికిత్స అందిస్తారని ఆమె తెలిపారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తక్కువ స్థాయిలోనే ఉందని, ఇప్పటి వరకూ మన భారతదేశంలో కానీ, ఏపీలో కానీ ఎక్కడా కేసులు నమోదు కాలేదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని డాక్టర్ పద్మావతి వివరించారు.

'కొత్త 'చైనా' వైరస్‌తో భయపడాల్సిన అవసరం లేదు- ఆ జాగ్రత్తలు తీసుకుంటే చాలు!'

ABOUT THE AUTHOR

...view details