HCL Team Meeting With Minister Nara Lokesh : రాష్ట్రంలో భారీగా కార్యాకలాపాల విస్తరణకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోంది. హెచ్‌సీఎల్ ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ శివ శంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. మరో 15 వేల ఉద్యోగాల కల్పనకు సుముఖత వ్యక్తం చేశారు. 2014 తెలుగుదేశం హయాంలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌సీఎల్‌లో ప్రస్తుతం 4 వేల 500 మందికి ఉద్యోగాలు లభించాయి. విస్తరణ ద్వారా మరో 5 వేల 500 మందికి ఉద్యోగలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌సీఎల్ ప్రతినిధులు తెలిపారు.
ఫేజ్ 2లో భాగంగా నూతన కార్యాలయ భవన నిర్మాణం చేపట్టి మరో 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ట్రెండ్స్‌కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్ననైపుణ్యగణన, నైపుణ్యాభివృద్ధిలో తాము భాగస్వామ్యం వహిస్తున్నామన్నారు. విస్తరణకు సంబంధించి గత ప్రభుత్వంలో నిలిపివేసిన అనుమతులు విడుదల చేయాలని మంత్రి లోకేశ్‌ని కోరారు.
Lokesh Comments On Jagan Regime :మరోవైపు జగన్ ఐదేళ్ల పాలన దుష్పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దారుణంగా దెబ్బతీశాయని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ దుయ్యబట్టారు. కంపెనీలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్‌లు కూడా జగన్ దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రోత్సాహకాలు అందడం లేదనే విషయాన్ని జపాన్ కంపెనీల అసోసియేషన్ ప్రెసిడెంట్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారన్నారు. జగన్ అసమర్థ, అవినీతి పాలనతో, ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఎలా దెబ్బతిందో చూడాలంటూ సంబంధిత వీడియోను ఎక్స్‌లో లోకేశ్ పోస్ట్ చేశారు.