Drinking Water Problem in Gudivada : వేసవి రాకుండానే కృష్ణాజిల్లా గుడివాడలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. తమకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వాలని పట్టణవాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాగునీటి కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వమైనా సమస్యను పరిష్కరించి తమ దాహార్తిని తీర్చాలని వేడుకుంటున్నారు.
తాగునీటికి అవస్థలు : గుడివాడ పట్టణ ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నారు. గత టీడీపీ పాలనలో అమృత్ పథకంలో భాగంగా 2018లో పట్టణంలో ప్రతి ఇంటికీ కుళాయి ఏర్పాటు చేశారు. ఇందుకోసం నాగవరప్పాడు, గుడ్ మెన్ పేటలో రెండు ట్యాంకుల నిర్మాణం చేశారు. వాటర్ ట్యాంకులకు అనుసంధానంగా ఇంటింటికీ వేసిన పైప్ లైన్లకు ఇంటర్ కనెక్షన్లు ఇచ్చే సమయానికి ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమృత్ పథకాన్ని పక్కనబెట్టింది. దీంతో తాగునీటికి అవస్థలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా అవి సరిపోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు.
బోర్లు వేయిస్తే ఉప్పు నీళ్లు : పట్టణంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు రైల్వే స్టేషన్ సమీపంలోని MRO కార్యాలయం వద్దనున్నహెడ్ వాటర్ ట్యాంక్ నుంచి ట్యాంకుల ద్వారా మచినీటిని సరఫరా చేస్తున్నారు. మాములు రోజుల్లోనే రెండు, మూడు రోజులకు ఒకసారి వాటర్ ట్యాంక్ వస్తుందని ఇంకా వేసవి తీవ్రత పెరిగితే పట్టణమంతా నీటి ఎద్దడి తలెత్తుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడిని అధిగమించేందుకు తామే ఇళ్లల్లో బోర్ వేయిస్తే ఉప్పు నీళ్లు వస్తున్నాయని, అవి తాగేందుకు వీలు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ చుట్టపక్కల పల్లెల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని ప్రజలు వాపోతున్నారు.