Government Simplified To NTR Bharosa Pension Scheme : ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసింది. ఇకపై ఆరేడు నెలలకు ఒకసారి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే ధోరణికి స్వస్తి పలికింది. ఇప్పటికే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలే పింఛను ఇచ్చే విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీన్నే స్పౌజ్ క్యాటగిరీగా గుర్తిస్తూ పింఛను మంజూరు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గత నెల నవంబరు 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్బంగా స్పౌజ్ క్యాటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛను మంజూరు చేస్తామని ప్రకటించారు.
కొత్తగా 5,402 మందికి ఫించన్లు : అందులో భాగంగానే నవంబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు కొత్తగా 5,402 మందికి వితంతువు (ఇప్పటికే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోయిన వారికి) క్యాటగిరీలో ప్రభుత్వం పింఛను మంజూరు చేసింది. వీరికి డిసెంబర్ 31వ తేదీన రూ.4 వేల చొప్పున పింఛను పంపిణీ చేయనున్నారు. అలాగే గత మూడు నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పింఛను తీసుకోని 50 వేల మందికి సైతం అందించనున్నారు. వీరికి రెండు, మూడు నెలల మొత్తాన్ని కలిపి ఒకేసారి డిసెంబరు 31వ తేదీన పంపిణీ చేయనున్నారు.