Government Serious on Illegal Sand Mining in NTR District :ఎన్టీఆర్ జిల్లాలో అక్రమ మట్టి దందాను మైనింగ్ అధికారులు నిగ్గు తేల్చారు. ఐదేళ్లలో అక్రమ మట్టి తవ్వకం మొత్తం 10.54 లక్షల క్యూబిక్ మీటర్లగా అధికారులు తేల్చారు. దీని విలువ రూ. 90.39 కోట్లని సమాచార హక్కు చట్టం సాక్షిగా వెల్లడించారు. కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు ప్రాంతాల్లో భారీగా అక్రమ క్వారీయింగ్ జరిగిందని గుర్తించిన అధికారులు కేవలం రూ. 90.39 కోట్ల వసూలుకు డిమాండ్ నోటీసులు జారీ చేయడం చర్చాంశనీయంగా మారింది. గత ఐదేళ్లలో 515 కేసులు జిల్లాలో నమోదు చేసినట్లు చెబుతున్నారు. దీనిలో 175 మందికి అక్రమ తవ్వకాల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
ఎన్టీఆర్ జిల్లాలో అక్రమమట్టి దందా తవ్వేకొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సమాచారహక్కు చట్టం కింద కొత్తూరు తాడేపల్లికి చెందిన మెండెం జములయ్య అనే వ్యక్తి అడిగిన సమాచారానికి గనులు, భూగర్భ గనుల శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌కుమార్ బదులు ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ఉన్న విజయవాడ గ్రామీణ మండలంలోని పలు గ్రామాల నుంచి విచ్చలవిడిగా తవ్వకాలు జరిగినట్లు వెల్లడించారు.
ఇటీవల వరకు ఈ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అదేమని గ్రామస్తులు అడ్డుకుంటే జగనన్న కాలనీల మెరక పేరుతో తహశీల్దారు జారీ చేసిన లేఖలు చూపించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. వాస్తవానికి ఎలాంటి తవ్వకాలు జరపాలన్నా, గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సిందే. పాతపాడు పరిధిలో నలుగురు ప్రైవేటు వ్యక్తులకు లీజులు మంజూరు చేసిన గనుల శాఖ ఎంత పరిమాణం అనేది పేర్కొనలేదు. మిగిలిన ప్రాంతాల్లో మూడు లీజులు విజయవాడ బైపాస్ రహదారి నిర్మాణం చేస్తున్న ప్రైవేటు సంస్థకు తాత్కాలికంగా ఇచ్చిన అనుమతులే.
నైనవరంలో ఒకే ఒక్క అనుమతి ఇచ్చారు. కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు, పాతపాడు, పోలవరం కాలువ కట్టలపై, అటవీశాఖ భూముల్లో కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఘనపరిమాణంలో మట్టి తవ్వకాలు జరిగాయి. నాటి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములుగా మట్టి వ్యాపారం చేశారు. నాడు తాత్కాలిక అనుమతులు తీసుకున్నామని, జలవనరుల శాఖ పోలవరం విభాగం ఇంజినీర్లు అనుమతులు ఇచ్చారని పలువురు యధేచ్ఛగా తవ్వకాలు జరిపారు. కానీ అవన్నీ ఉత్తవేనని సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న సమాచారంలో తేటతెల్లమైంది.
యురేనియం అనుమతులు రద్దు చేయకపోతే ఉద్యమిస్తాం - 15 గ్రామాలు హెచ్చరిక