Govt Jobs Preparation Plan for 2025 Year : నూతన సంవత్సరం 2025లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్లు దిశా నిర్దేశం చేయబోతున్నాయి. ఏయే నియామక పరీక్షలు రాయాలో, ఎంతకాలం ప్రిపేర్ కావాలో మొదలైన అంశాలపై స్పష్టమైన ప్లాన్ రూపొందించుకునే అవకాశం ఉంటోంది. ఎన్నో ఆశలతో జీవితంలో స్థిరపడాలనుకునే యువత 2025 కొత్త సంవత్సరంలోనే పోటీపరీక్షలకు మెరుగైన ప్రిపరేషన్‌ను కొనసాగించేలా జాబ్ క్యాలెండర్ మంచి సాధనంగా ఉపయోగపడుతోంది. గ్రూప్ 1 ప్రధానంగా డిస్క్రిప్టివ్ పరీక్ష. ఈ తరహా పరీక్షల్లో విజయం సాధించాలంటే భావవ్యక్తీకరణతో పాటు రైటింగ్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషిస్తాయి.
దీని వల్ల జాబ్ క్యాలెండర్‌లో పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీల ఆధారంగా ఆయా సామర్థ్యాలు సమకూర్చుకునే సమయం, శక్తి తమకుందో లేదో ఆత్మ పరిశీలన చేసుకున్నాకే ఈ పరీక్షల్లోకి దిగటం సముచితం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయగా ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది స్పష్టం చేసింది. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా పరీక్షల సంస్కరణలకు నియమించిన కమిటీ కూడా నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదికలో జాబ్ క్యాలెండర్‌ను తయారు చేసి పరీక్షలు నిర్వహించేలా ప్రతి ఏడాదిలో డిసెంబర్ 30లోగా నియామకాలు పూర్తి అయ్యేలా సూచించింది. జాబ్ క్యాలెండర్ అమలు సులువు అయ్యేలా అనేక సూచనలు కూడా చేసింది.
ఒక ఏడాదిలో ఏయే ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తారో జాబ్ క్యాలెండర్ ద్వారా తెలియజేస్తారు. ఈ క్రమంలో ఏయే ఉద్యోగాలకు అర్హులుగా సరిపోతామో అభ్యర్థులు నిర్ణయించుకోవాలి. ఇంతకముందు ఏ నోటిఫికేషన్లు వస్తాయో తెలిసే పరిస్థితి ఉండేది కాదు. ఆ సందిగ్ధత ఇప్పుడు లేదు. అందుకు ముందుగానే అభ్యర్థులు మొత్తం నోటిఫికేషన్లలో ఒకటో, మరికొన్నో ఎంపిక చేసుకుని సిద్ధంగా ఉండాలి. నోటిఫికేషన్ల ప్రకారం ప్రణాళికను తయారు చేసుకుని ప్రిపేర్ కావాలి.
సిలబస్, పరీక్ష విధానం
- విభిన్న పరీక్షల విధానం, సిలబస్ ఒకటే అయితే ఆయా పరీక్షల టైం ఎక్కువగా లేకపోయినా ఒక ప్రిపరేషన్‌తో అన్నిటినీ ఎదుర్కోవచ్చు. సిలబస్ ఒకటై పరీక్ష విధానంలో మాత్రం తేడా ఉంటే ప్రిపరేషన్ విధానంలోనూ తేడా ఉంటుంది. అందుకు కావాల్సిన సమయం ఆ పరీక్షల మధ్య ఉందా లేదా అని పరిశీలించుకుని సన్నద్ధం కావడం మంచిది. ఉదాహరణకు సిలబస్ ఒకటే కానీ ఒక పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మరొకటి సబ్జెక్టివ్ విధానంలో ఉంటే ఆ ఎగ్జామ్ల మధ్య విరామం ఎక్కువున్నప్పుడే ఆ రెండిటికీ ప్రిపేర్ కావడం మంచిది.
- ఉన్నత విద్యార్హతల కోరే అభ్యర్థులు పోటీ పరీక్షలతో సమన్వయం చేసుకుంటూ రెండింటికి ప్రిపరేషన్ కొనసాగించాలనుకుంటే అప్పుడు మాత్రమే రెండింటిపై శ్రద్ధ చూపించవచ్చు. రెండింటికి ఒకే సమయంలో పరీక్షలు వస్తే ముందుగానే నిర్ణయించుకుని ఏదో ఒక దాని వైపు మొగ్గు చూపిస్తే కెరియర్‌కు బాగా ఉపయోగపడుతుంది.