Government Installs Transponders on Fishermen Boats : మత్స్యకారుల విషయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నడి సంద్రంలో ప్రతికూల, ఆపద సమయాల్లో మత్స్యకారుల ప్రాణల రక్షణ కోసం వారి బోటుకు ఇస్రో రూపొందించిన ట్రాన్స్ పౌండర్లు అమర్చుతున్నారు. దీంతో బోట్లు సముద్రంలో ఎక్కడ ఉన్నా, శాటిలైట్స్ ఇట్టే గుర్తిస్తాయి. అలాగే తుఫాను లాంటిది వస్తే, అప్పుడు ఆ జాలర్లు ఎక్కడున్నారో, వారి పడవ ఎక్కడుందో ఇస్రో గుర్తించి సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వగలదు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 'మత్స్యరంగంలో స్పేస్ టెక్నాలజీ' వినియోగంపై ఈరోజు (శుక్రవారం) విశాఖపట్నంలోని భారత మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్కొన్నారు.
మత్స్యకారులకు రక్షణ : ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ, ఆగస్టు 23న జరుగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలకు ముందస్తూ కార్యకలాపాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన ట్రాన్స్ పౌండర్లను ప్రతి మోటరైజ్డ్, మేకనైజ్డ్ బోటు ఓనర్లు అందరూ వినియోగించాలని అన్నారు. ఈ ట్రాన్స్ పౌండేర్లు ఉచితంగా భారత ప్రభుత్వం అందరికీ అందిస్తున్నట్లు తెలిపారు. బోటు యజమానులందరూ మత్స్యశాఖ సహకారంతో వారి బోటులకు ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాని కోరారు. ఇది వాతావరణం, చేపల పెంపకానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుందని తెలిపారు. అలాగే తుఫాను హెచ్చరికలను ఈ పరికరం ద్వారా జారీ చేస్తుందని వివరించారు. పడవలోపల అమర్చిన బజర్ నొక్కడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మత్స్యకారులను అప్రమత్తం చేయడానికి ఉపయోగించవచ్చాని తెలిపారు. కావున మత్స్యకారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.