Google Agreement With Andhra Pradesh Government : రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు గూగుల్ సహకరించనుంది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజలు వివిధ రకాల సర్టిఫికెట్లు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సెల్ ఫోన్ ద్వారా ఆయా సేవలను అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు.
యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులు, డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం 10 వేల మందికి గూగుల్ ఎసెన్సిషియల్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తుందని తెలిపారు. రోజువారీ జీవితంలో ఏఐని ఎలా ఉపయోగించాలి, ఏఐ ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఈ కోర్సులో అంతర్భాగంగా ఉంటాయన్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, జనరేటివ్ ఏఐ వంటి రంగాల్లో గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్‌లు, స్కిల్ బ్యాడ్జ్‌లను గూగుల్ అందజేస్తుందన్నారు.
ప్రభుత్వ ఏజెన్సీల కోసం స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను అందించడానికి ప్రభుత్వంతో గూగుల్ క్లౌడ్ సహకరిస్తుందని తెలిపారు. కంప్యూటర్ సైన్స్ విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అధ్యాపకులకు గూగుల్ సాంకేతిక మద్దతును అందిస్తుందన్నారు. వ్యవసాయం, ట్రాఫిక్ నిర్వహణ, వెబ్‌సైట్ ఆధునీకరణ, పౌరుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలలో క్లౌడ్ టెక్నాలజీ, AI ప్రయోజనాలపై కీలక రంగాలలో పైలట్ ప్రాజెక్ట్‌లకు గూగుల్ సహకరిస్తుందని వివరించారు.
"గెలవాలంటే నిలబడాలి" - ఐటీ అభివృద్ధి చంద్రబాబు అద్భుత కృషి ఫలితమే : మంత్రి లోకేశ్