Viral Fevers in Krishna District : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గొడవర్రు గ్రామంలో ప్రజలు గత నెల రోజులుగా జ్వరాలు, కీళ్లనొప్పులు, దగ్గు, జలుబుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ సమస్య నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఉంది. కేవలం గొడవర్రు గ్రామంలోని గౌడ బజార్ ఒక్కదానిలోనే సుమారు 35 మంది ఈ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.
స్పందించని వైద్య సిబ్బంది : ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఈ సమస్య గురించి తెలియజేసినా సాధారణ మందులతోనే కాలం వెళ్లదీస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. అంతేకాక ఇక్కడ పని చేసే వైద్య సిబ్బంది తగిన విధంగా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఒక్కొక్కరు 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టామని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.