BhadrachalamGodavari Water Level Today: తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈరోజు ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 46.5 అడుగులు దాటి ప్రవహిస్తుండగా ప్రస్తుతం అది 47.1 అడుగులకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం నీటిమట్టం 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇలాగే 48 అడుగులకు చేరితే, అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు.
Godavari Flow in Bhadrachalam : మరోవైపు చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 25 గేట్లను ఎత్తి 57,000ల క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరిలోనికి విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని సీతవాగు గొబ్బలి మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం పెరిగితే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల వెళ్లే ప్రధాన రహదారి పైకి వరద నీరు వచ్చి చేరనుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అప్రమత్తమైన అధికారులు :భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగుల స్థాయి నుంచే పలు గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి వరద 73 అడుగుల స్థాయిని తాకితే పరవాహక ప్రాంతాల్లో 109 గ్రామాలతో పాటుగా భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందని చెప్పారు. 2023లో 73 అడుగుల స్థాయిని దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు, ఏ స్థాయిలో ఏ గ్రామం ప్రభావితమవుతుందనే వివరాలను నీటిపారుదలశాఖ పోర్టల్లో ఉంచినట్లు ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ వివరించారు. గోదావరి, కృష్ణా పరీవాహకాల్లోని ప్రాజెక్టుల వద్ద ఇంజినీర్లను అప్రమత్తం చేశామన్నారు.