ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందని కిడ్నాప్ - చాకచక్యంగా తప్పించుకున్న బాలిక - GIRL KIDNAP IN GUNTUR

గుంటూరులో బాలిక అపహరణ కలకలం - తల్లికి రోడ్డుప్రమాదం జరిగిందని బాలికను కారులో తీసుకెళ్లిన ముఠా

girl_abducted_in_guntur
girl_abducted_in_guntur (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2024, 7:36 PM IST

Updated : Dec 16, 2024, 10:22 PM IST

Girl escapes after being abducted by kidnappers in Guntur:గుంటూరు నడి బొడ్డున పట్టపగలే ఓ బాలికను దుండగులు కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. కిడ్నాప్​న​కు గురైన బాలిక చాకచక్యంగా దుండగుల నుంచి తప్పించుకుంది. ఆర్టీసీ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి బాలికను రక్షించారు. దుండగులను పట్టుకునేందుకు యత్నించగా ఆ లోపే అప్రమత్తమైన వారు తప్పించుకుని పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ టీవీ దృశ్యాలు, కారు నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాలిక సురక్షితంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ జరిగింది: గుంటూరులోని వెంగళరావునగర్​లో తల్లిదండ్రులతో పాటు నివసిస్తోన్న 12 ఏళ్ల బాలికను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కార్లో వచ్చిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికకు మాయమాటలు చెప్పారు. బాలిక తల్లి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిందని వెంటనే తమతో రావాలని ఘటనా స్థలికి తీసుకు వెళ్తామని తెలిపారు. వచ్చిన వ్యక్తులు కొత్తవారు కావడంతో తొలుత బాలిక నమ్మలేదు. తన తల్లికి ఫోన్ చేసి తెలుసుకుంటానని వారితో చెప్పింది. దీంతో అప్రమత్తమైన దుండగులు రోడ్డు ప్రమాదంలో ఫోన్ పగిలిపోయిందని, ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని, తన కూతురుని చూడాలని అనడంతో వచ్చామని నమ్మబలికారు.

దీంతో వారి మాటలను నమ్మిన బాలిక వారి వెంట నడిచింది. కారు ఎక్కించుకున్న కిడ్నాపర్లు బాలికను విజయవాడ మీదుగా సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. కొద్ది దూరం వెళ్లాక బాలిక తాగేందుకు డ్రింక్​ను ఇచ్చారు. దాన్ని తాగిన అనంతరం నిద్రలోకి జారుకుంది. గంటన్నర తర్వాత కారు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్దకు రాగా అప్పుడే బాలికకు మెళకువ వచ్చి ఎక్కడున్నామని ప్రశ్నించింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్నామని, కాసేపట్లో మీ అమ్మ వద్దకు వెళ్తామని దుండగులు తెలిపారు. బస్టాండ్​లోని పార్కింగ్ ప్రాంతంలో కారును ఆపిన దుండగులు భోజనం చేసి వస్తామని కార్లోనే కూర్చోవాలని బాలికకు సూచించి బస్టాండ్​లోకి వెళ్లారు.

AI నైపుణ్యాలకు పదును - VVITలో గూగూల్ పైలెట్ ప్రాజెక్ట్

తాను కిడ్నాప్​నకు గురైనట్లు అనుమానం వచ్చిన బాలిక కారు నుంచి బయటకు వచ్చేందుకు యత్నించింది. కారుకు తాళం సరిగా పడకపోవడంతో తెరుచుకున్నాయి. బస్టాండ్​లోకి వచ్చి ఓ ప్రయాణికుడి సాయంతో సమాచార కేంద్రం వద్ద ఉన్న ఆర్టీసీ సిబ్బంది వద్దకు వచ్చింది. అక్కడే విధుల్లో ఉన్న ఆర్టీసీ కంట్రోలర్ డి.బసవాచార్యులు బాలిక చెప్పే వివరాలు తెలుసుకున్నారు. వెంటనే బాలిక తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు. తనకు ప్రమాదం ఏమీ జరగలేదని ఆమె చెప్పడంతో తాను కిడ్నాప్​న​కు గురైనట్లు బాలిక నిర్దారణకు వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ ఉద్యోగి బాలికను కార్యాలయంలో దాచారు. బాలిక తమ వద్ద సురక్షితంగా ఉందని వచ్చి తీసుకుని వెళ్లాలని కుటుంబ సభ్యులకు తెలిపారు.

పారిపోయిన కిడ్నాపర్లు: బాలికను ఆర్టీసీ సిబ్బంది రక్షించి, అదే సమయంలో కిడ్నాపర్లు బస్టాండ్​లో హోటల్​లోకి వచ్చారని తెలుసుకుని వారిని పట్టుకునేందుకు యత్నించారు. బాలిక చెప్పిన వివరాల మేరకు ఆర్టీసీ సిబ్బంది బస్టాండ్ లోపల, బయట ఉన్న క్యాంటీన్లలో వెతికారు. మరికొందరు బస్టాండ్​లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దుండగుల కోసం వెతికినా వారిని గుర్తించేందుకు తమతో పాటు బాలిక లేకపోవడంతో కిడ్నాపర్లను గుర్తించలేకపోయారు. పోలీసులు తమకోసం వెతుకుతున్నారని గుర్తించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. విషయాన్ని బాలిక కుటుంబానికి తెలిపిన ఆర్టీసీ సిబ్బంది, వారు వచ్చే వరకు బాలికను తమ సంరక్షణలో ఉంచుకుని ధైర్యం కల్పించారు. తమ అమ్మాయిని తమకు అప్పగించడంపై బాలిక బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.

రంగంలోకి పోలీసులు: బాలిక కిడ్నాప్​న​కు గురైన వ్యవహారంపై ఫిర్యాదు తీసుకున్న కృష్ణలంక పోలీసులు, దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. బస్టాండ్ లోపల, బయట ఉన్న క్యాంటీన్లలో సీసీ కెమెరాలు సహా గుంటూరు నుంచి విజయవాడకు వచ్చే మార్గంలో ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలను సేకరిస్తున్నారు. బాలిక చెప్పిన అంశాల మేరకు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక చాకచక్యంగా తప్పించుకోవడం సహా జరిగిన పరిణామాలను తెలుసుకున్న ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు నివ్వెరపోయారు. సమయోచితంగా వ్యవహరించి బాలిక కిడ్నాపర్ల బారిన పడకుండా రక్షించిన ఆర్టీసీ సిబ్బందిని అధికారులు అభినందించారు. మాయ మాటలు చెప్పి పిల్లలను కిడ్నాప్ చేసే ఈ తరహా ముఠాల పట్ల తల్లిదండ్రులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

'డబ్బులిస్తావా-చంపేయాలా' - కిడ్నాపర్​ చెర నుంచి తప్పించుకున్న బాధితుడు

కోరిక తీర్చలేదని మహిళ కుమారుడి హత్య - నిందితుడు వరుసకు మేనమామ

Last Updated : Dec 16, 2024, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details