GAME CHANGER BENEFIT SHOWS: గేమ్ ఛేంజర్ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీలోని థియేటర్లలో సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ హోంశాఖ సర్క్యులర్ మెమో జారీ చేసింది. సినిమా రిలీజ్ కానున్న జనవరి 10వ తేదీ తెల్లవారుజాము 1 గంటకు నిర్వహించే బెనిఫిట్ షో టికెట్లు ఒక్కొక్కటీ రూ.600 చోప్పున విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
అలాగే జనవరి 10 తేదీన ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకూ అనుమతి ఇచ్చారు. మల్టిప్లెక్స్‌లలో అదనంగా రూ.175 మేర పెంచేందుకు అనుమతి మంజూరు చేశారు. సింగిల్ థియేటర్లలో రూ.135 వరకూ టికెట్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జనవరి 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి మంజూరు చేస్తూ హోశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ మెమో జారీ చేశారు.
ట్రెండింగ్‌లో ట్రైలర్: మరోవైపు ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ రిలీజైంది. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, శంకర్ కాంబోలో 'గేమ్ ఛేంజర్' మూవీ తెరకెక్కింది. ట్రైలర్‌లోని చరణ్ డైలాగులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గురువారం ట్రైలర్ రిలీజ్ కాగా ఇప్పటికీ యూట్యూబ్‌లో టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ తెలుగులో 54 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. కమెడియన్లు బ్రహ్మనందం, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు సైతం ట్రైలర్లో కనిపించారు. గేమ్ ఛేంజర్ ట్రైలర్లో విజువల్స్ నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. రామ్ చరణ్, యస్జే సూర్య మధ్య జరిగే వార్ సినిమాను సూపర్ హిట్ చేస్తుందని అంటున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్:అదే విధంగా గేమ్‌ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాజమహేంద్రవరంలో భారీగా ఏర్పాట్లు చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా కోసం మూడు సంవత్సరాలుగా ఎదురుచూసిన మెగా అభిమానులు భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తరలివచ్చారు. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం-వేమగిరి జాతీయ రహదారి పక్కన భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు.
రాజమహేంద్రవరంలో మెగా పవర్ ఈవెంట్ - ఒకే స్టేజ్‌పై బాబాయ్-అబ్బాయ్ సందడి