National Awards in AP Panchayats : ఏపీకి చెందిన నాలుగు పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయి. సామాజిక న్యాయం, భద్రత విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడు మండలం ముప్పాళ్ల పంచాయతీ ఎంపికైంది. ఆరోగ్య పంచాయతీ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో బొమ్మసముద్రం, తాగునీటి వసతి సమృద్ధిగా ఉండే పంచాయతీల్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి ఎంపికైంది. పరిశుభ్రత-పచ్చదనంలో అదే జిల్లా అనకాపల్లి గ్రామీణ మండలంలోని తగరంపూడి, జాతీయ అవార్డులకు ఎంపికయ్యాయి.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం కింద అవార్డుకు ఎంపికైన ఒక్కో పంచాయతీకి కేంద్రం రూ.కోటి చొప్పున అందజేయనుంది. ఈ నెల 11న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా సర్పంచులకు పురస్కారాలు అందజేస్తారు. రాష్ట్రపతి బటన్ నొక్కి పంచాయతీల బ్యాంకు ఖాతాలకు నగదు మొత్తాన్ని బదిలీ చేయనున్నారు. అవార్డులకు ఎంపికైన పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా ముందుకు కదులుతూ పంచాయతీలు సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని పవన్ వివరించారు.