People No Entry in Nallamala Forest : జులై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో వ్యాఘ్రాలకు ఏకాంత సమయం. ఈ మూడు నెలలు పులులు జత కట్టే కాలం. అటవీ ప్రాంతంలో జన సంచారం కారణంగా వాటి ఏకాంతానికి భంగం వాటిల్లుతోంది. ఇది వాటి సంతానోత్పత్తిపై ప్రభావం చూపే ఆస్కారం ఉంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న పులుల సంరక్షణ కేంద్రాల్లో మూడు నెలలపాటు జన సంచారాన్ని నిషేధిస్తున్నారు. ఇందులో భాగంగా నల్లమలలోనూ నిషేధం అమలు కానుంది.
ఆగస్టు నుంచి పూర్తి నిషేధం : నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఆదేశాల మేరకు తెలంగాణలోని ఆమ్రాబాద్ పులుల అభయారణ్యంలోకి ప్రజల ప్రవేశాలపై నిషేధించారు. వ్యాఘ్రాల పునరుత్పత్తి సమయం కావడంతో పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాల సందర్శన, సఫారీలను నిలిపేశారు. మన నల్లమలలో ప్రస్తుతం జన సంచారంపై ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఇతర కార్యకలాపాలను ఆగస్టు నెల ఒకటి నుంచి పూర్తిగా నిషేధించనున్నారు.
ఈ మూడు నెలలే కీలకం : నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో 75 పులులు ఉన్నట్లు 2022 గణనలో నిర్ధారించారు. 2024 సాధారణ గణనలో నల్లమలలో 80 వ్యాఘ్రాలు ఉన్నట్లు వెల్లడైంది. పెద్ద పులులు జులై నుంచి సెప్టెంబర్ నెల మధ్య సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఆ సమయంలో ప్రశాంత వాతావరణంతో పాటు ఏకాంతాన్ని కోరుకుంటాయి. నీటి వనరులున్న ప్రాంతంలో సేదతీరుతాయి. అడవిలో ఏ చిన్న అలజడి అయినా అవి బెదిరిపోతాయి.