Count 366 IOT Device in Aquaculture :ఆక్వా సాగుకు ఉభయ పశ్చిమ ఏపీలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఎన్నో ప్రతికూలతలు అధిగమిస్తే గానీ మెరుగైన దిగుబడులు రాని పరిస్థితి ఈ సాగులో నెలకొంది. అలాంటి అవాంతరాలు అధిగమించేందుకు మత్స్యశాఖ ఇటీవల ఒక సాంకేతిక పరికరం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరికకరం ద్వారా ఆక్వా చెరువు స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఇలా ఆక్వా చెరువుల్లో వస్తున్న వివిధ మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుని, సత్వరం స్పందించేలా కౌంట్ 366 అనే ఐ.ఒ.టి. డివైస్‌ను మత్స్యశాఖ తెరపైకి తెచ్చింది. దీన్ని యలమంచిలి మండలం కలగంపూడిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిగా సత్ఫలితాలు రాబట్టింది. దీంతో అన్ని ప్రాంతాలకు వీటి సేవలను విస్తరింపజేయనున్నారు.
ఇవే కీలకం :ముఖ్యంగా ఆక్వా సాగు సక్రమంగా సాగాలంటే ఆక్సిజన్ (డీవో), హైడ్రోజన్ గాఢత (పీహెచ్), ఉష్ణోగ్రత, అమ్మోనియా స్థాయిలు సక్రమంగా ఉండాలి. వీటిలో ఏ ఒక్క దానిలో వ్యత్యాసం వచ్చినా అత్యవసర పెట్టుబడులు పెట్టాల్సిందే. అయితే ఈ సాంకేతిక పరికరం అందుబాటులో ఉంటే ఈ సమస్యల నుంచి రైతు గట్టెక్కగలరని మత్స్యశాఖ నరసాపురం సహాయ సంచాలకుడు ఎల్.ఎల్.ఎన్.రాజు పేర్కొంటున్నారు.
ఎలా పని చేస్తుందంటే :
- ఆక్వా చెరువులో అమర్చిన ఈ డివైస్‌ను సంబంధిత రైతు చరవాణిలో యాప్‌నకు అనుసంధానం చేస్తారు.
- చెరువులో ఏ చిన్న తేడా వచ్చినా రైతు చరవాణికి సంక్షిప్త సందేశం వెళ్తుంది.
- ఈ యంత్రంలో ప్రోబ్స్ అనే పరికరం ఉంటుంది. దీనిలో సెన్సార్లు, అంతర్జాలం ఆధారంగా పనిచేసే ఇతర పరికరాలు ఉంటాయి. ప్రోబ్స్ చెరువు మధ్యలో సగం మునిగేలా ఉంచుతారు. దీనిలోని రిసీవర్లు చెరువు నీటిలో ఏ సమస్య వచ్చినా ఆ లోపాన్ని తెలియజేస్తూ సందేశం పంపుతుంది.
విద్యుత్ బిల్లులు ఆదా :వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో ఆక్సిజన్ సమస్య వస్తుందనే భయంతో రైతులు గాలి పంకాలు (ఏరియేటర్లు) తిప్పుతుంటారు. చెరువులకు సరిపడా ఆక్సిజన్ స్థాయి ఉంటే తిరిగే పంకాలను ఆటోమెటిక్‌గా ఈ పరికరం నిలిపేస్తుంది. మళ్లీ అవసరమైతే తిరిగేలా చేస్తుంది. దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 13,648 కనెక్షన్లకు నెలకు రూ.20 కోట్లు రాయితీని ప్రభుత్వం భరిస్తుంది. డివైస్ వినియోగం వల్ల వినియోగం తగ్గితే పరోక్షంగా సర్కార్‌పై కూడా కొంత భారం తగ్గుతుంది. ప్రభుత్వం తరఫున రాయితీపై ఈ డివైస్‌ను అన్నదాతలకు అందజేయడానికి ప్రతిపాదనలు పంపామని మత్స్యశాఖ జేడీ ప్రసాద్ పేర్కొన్నారు.
అటు ఐటీ ఉద్యోగం ఇటు చేపల పెంపకం - రెండు చేతులా సంపాదన
విభిన్న వాతావరణ పరిస్థితులతో ఆక్వా రంగం అతలాకుతలం - చెరువుల్లో తగ్గుతున్న ఆక్సిజన్ - aqua sector problems