ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మట్టికుండకు తాళి బొట్టు - ఎలమాస పండగలో ప్రతీది ప్రత్యేకమే - ELAMASA FESTIVAL IN TELANGANA

తెలంగాణలోని జుక్కల్‌ నియోజకవర్గంలో ప్రత్యేక పండగ

Elamasa Festival in Telangana
Elamasa Festival in Telangana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 2:08 PM IST

Elamasa Festival in Telangana : తెలంగాణలోని జుక్కల్‌ నియోజకవర్గం త్రిభాషా సంగమంగా పేరొందింది. మూడు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు కనిపించేది ఇక్కడే. ఈ ప్రాంత ప్రత్యేకతను చాటే ఓ పండగ రాష్ట్రంలోనే భిన్నంగా జరుపుకొంటారు. అదే ఎలమాస పండగ. ప్రతి ఏటా అమావాస్య రోజున (వార్షిక పండగ) జరుపుకొంటారు. అమావాస్య ఉండటంతో ఈ పర్వదినాన్ని ఎలమాస్య పండగ అంటుంటారు.

ఈ ప్రాంతంలో రబీలో అంతా ఆరు తడి పంటలే. చేలల్లో జొన్న మొక్కలతో కట్టిన గుడిలో అన్నీ మట్టి విగ్రహాలను తయారు చేస్తారు. అందులో లక్ష్మీదేవి, పాండవుల విగ్రహాలతో పాటు రైతులు, కాడెద్దులు, కాపలాదారుల మట్టి విగ్రహాలు ఆకర్షణీయంగా రూపొందిస్తారు. ఎలమాస పండగ జరుపుకొనే నాటికి లక్ష్మీదేవి గర్భవతిగా ఉన్నట్లు అన్నదాతలు భావిస్తారు. కడుపులో బిడ్డను మోస్తున్న లక్ష్మీదేవిని సంపూర్ణ ఆరోగ్యంగా చూసుకోవాలనే ఉద్దేశంతో సీమంతం తరహాలో అలంకరించి పూజలు నిర్వహిస్తారు.

జామ, చెరకు, రేగి పండ్లతో పాటు కంది, శనగ, తదితర గింజలను సమర్పిస్తారు. గుడికి కొంత దూరంలో మట్టి పాత్రలో పాలు పొంగించేందుకు మంట పెట్టి వస్తారు. ఆ తర్వాత రైతు కుటుంబమంతా బంధు, మిత్రులతో కలిసి చేనుకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. మట్టి కుండలో అంబలి పోసి ఆ కుండకు మంగళసూత్రం లేదా ముత్యాలహారం కట్టడం సంప్రదాయంగా భావిస్తారు. తూర్పు దిశలో పాలు పొంగితే పంట సమృద్ధిగా పండుతుందని భావించి, పాలు పొంగిస్తారు.

Jukkal Elamasa Festival :మగవాళ్లు మాత్రం ఒలిగ్యో ఒలిగ్యా సాలం పలిగ్యా అంటూ ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు వేస్తారు. జొన్న గుడిలోనే ఓ గొయ్యి తవ్వి అంబలి, అన్నంతో ఉన్న మట్టి కుండను మూసి ఉంచడం. పంట దిగుబడి వచ్చే సరికి మళ్లీ ఆ కుండను వెలికి తీసి దిగుబడిని అదే కుండలో నింపి ఇంటికి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది.

వినూత్న సంప్రదాయం :కట్టుకొన్న భర్త కట్టిన తాళిని మెడలో నుంచి తీసి మట్టి కుండకు మంగళసూత్రం కట్టే సంప్రదాయం ఆలోచింపజేస్తోంది. అంబలి కుండను నెత్తిన ఎత్తుకొన్న వ్యక్తి పంట చేలకు వెళ్లి తిరిగొచ్చే వరకు మౌన వ్రతం పాటించడం ఈ పండగ విశేషం. ధాన్యం కొలిచే పరికరం (అడ్డా)లో దీపం వెలిగించి ఊరి నడిబొడ్డున ఉండే ఆంజనేయస్వామి ఆలయం వరకు తీసుకు రావడం ప్రత్యేకత. పచ్చని పంటలో తూర్పు దిశన పాలు పొంగించడం ఆచారం. జొన్న మొక్కలతో కట్టిన గుడి చుట్టూ ఒలిగ్యో ఒలిగ్యా సాలం పలిగ్యా అంటూ బిగ్గరగా పలుకుతూ ప్రదక్షిణలు వేయడం సంప్రదాయం. ఇలా ఒక్కటేమిటి తెల్లవారుజామున 4:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు నిర్వహించుకునే ఎలమాస పండగలో ప్రతీది ప్రత్యేకంగానే ఉంటుంది.

"కొక్కొరొకో!" తగ్గేదేలే అంటున్న పందెం కోళ్ల ధర - ఒక్కో పుంజు ధర తెలిస్తే షాక్!

ధను సంక్రాంతి రోజు ఇలా పూజ చేస్తే చాలు- ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఖాయం!

ABOUT THE AUTHOR

...view details