Farmer Missing With his Goats in Forest :వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం కొరివి వాండ్ల పల్లె మిట్టకు చెందిన రైతు సొంటె గంగిరెడ్డి అడవికి మేకలను మేపుకొనేందుకు వెళ్లి మేకలతో సహా కనిపించకుండా పోయారు. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
సొంటె గంగిరెడ్డి రోజు మాదిరిగానే సోమవారం ఉదయాన్నే మేకలను మేపడానికి సమీప అడవి ప్రాంతానికి వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు గ్రామస్థులతో కలిసి అడవిలో ఈరోజు తెల్లవారుజాము రెండు గంటల వరకు వెతికారు. రైతు ఆచూకీ లభించకపోవడంతో మళ్లీ మంగళవారం ఉదయాన్నే ట్రాక్టర్లో 70 మంది అడవికి వెళ్లి వెతుకుతున్నారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఏదైనా అడవి జంతువుతో ప్రమాదానికి లోనయ్యాడా లేదా దొంగలు మేకల కోసం ఏదైనా హాని తలపెట్టారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.