Family Death in YSR District :నేటి కాలంలో చాలా మంది చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న వారిని విషాదంలోకి నెడుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో శుక్రవారం రాత్రి ఓ కుటుంబం అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడింది.
రైతు నాగేంద్ర (40) చీనీ తోట సాగు చేస్తున్నాడు. మరో పది ఎకరాల వరకు కౌలుకు తీసుకున్నాడు. మరోవైపు దాదాపు 20 లక్షల పైగానే అప్పులు చేశాడు. ఇటు ఆదాయం రాకపోగా అటు రుణ భారం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో నాగేంద్ర మనోవ్యథకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలోనే భార్య వాణి (38), కుమార్తె గాయత్రి (12), కుమారుడు భార్గవ్ (11)ను రాత్రి 9 గంటల ప్రాంతంలో తోటలోకి తీసుకెళ్లాడు.
భార్య, పిల్లలకు ఉరి వేసి, తర్వాత నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కొక్కరుగా పొలంలోకి వెళ్లడాన్ని గమనించిన గ్రామస్థులు అనుమానంతో అక్కడికి వెళ్లి చూశారు. అప్పటికే అందరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీనిపై వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ పరిశీలించారు. వీరి మృతికి ఆర్థిక సమస్యలా? ఆరోగ్య సమస్యలా? లేక ఎవరైనా ఒత్తిడి చేశారా అనే కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ వివరించారు. మరోవైపు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.