ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర ఖజానా నుంచి సాక్షి ఉద్యోగులకు జీతాలు బదిలీ: అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ - EX IPR COMISSIONER VIJAYKUMAR REDDY

ప్రజాధనాన్ని వృథా చేసిన తుమ్మా విజయ్​కుమార్​రెడ్డి - సాక్షి పత్రికకు, ఛానల్‌కు లబ్ధి

AG SRINIVAS ALLEGATION TO EX IPR COMMISSIONER VIJAYKUMAR  REDDY
AG SRINIVAS ALLEGATION TO EX IPR COMMISSIONER VIJAYKUMAR REDDY (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2025, 9:03 AM IST

Former Information Commissioner Vijaykumar Reddy Issue:సమాచారశాఖ కమిషనర్‌గా పనిచేసిన తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి హోదాను అడ్డుపెట్టుకొని ప్రజాధనాన్ని సాక్షి పత్రికకు, ఛానల్‌కు దోచిపెట్టారని ఏసీబీ తరపున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ హయాంలో మొత్తం రూ.859 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వగా అందులో రూ.371 కోట్ల విలువ(43%) చేసే ప్రకటనలను నిబంధనలకు విరుద్ధంగా కేవలం సాక్షి పత్రికకు కట్టబెట్టారన్నారు. ప్రకటనల ప్రచురణల కోసం సాక్షి యాజమాన్యం కోరిన ధర కంటే ఎక్కువ సొమ్మును చెల్లించి అనుచిత లబ్ధి చేకూర్చారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.19 కోట్లు నష్టం కలిగించారన్నారని ఆయన ఆరోపించారు.


ఏపీలో ప్రచురితమవ్వని పత్రికకు రూ.1.17 కోట్లు చెల్లింపు: అధిక సర్క్యులేషన్‌ ఉన్న పత్రికకు 28శాతం ప్రకటనలు, రెండో స్థానంలో ఉన్న సాక్షికి 43శాతం ప్రకటనలను ఇచ్చారని మూడో స్థానంలో ఉన్న పత్రికకు కేవలం 0.03శాతం మాత్రమే ప్రకటనలు ఇచ్చారని శ్రీనివాస్ వివరించారు. ఏపీలో ప్రచురితంకాని ఓ పత్రికకు రూ.1.17 కోట్లు చెల్లించారని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వ ప్రకటనల జారీ విషయంలో రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవో, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రకటనలు ఇచ్చి సంబంధిత ఏజెన్సీల నుంచి భారీ స్థాయిలో కమిషన్‌ తీసుకోవడం ద్వారా అనుచిత లబ్ధిని పొందారని శ్రీనివాస్‌ సుదీర్ఘంగా తన వాదనలను వినిపించారు.

సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ జీతాలు:ఉద్యోగుల నియామకం, ప్రకటనల జారీ, టారిఫ్‌ పెంపునకు సంబంధించిన జీవోలన్ని పిటిషనర్‌ పేరుపై జారీ అయ్యాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబ సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా 254 మందిని పొరుగు సేవలు, ఒప్పంద పద్ధతిలో ఉద్యోగులుగా నియమించారు. ఆ ఉద్యోగుల పేర్లను దిగువ స్థాయి సిబ్బందికి పంపి వారి నియమక దస్త్రాలను సిద్ధం చేయాలని కోరారు. ఈ మేరకు సాక్ష్యులు వాంగ్మూలం ఇచ్చారు. కొంత మంది సాక్షి ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు లేకుండానే సమాచారం, పౌరసంబంధాలశాఖ నుంచి జీతాలు చెల్లించారు. విజయ్‌కుమార్‌రెడ్డి పలు నిర్ణయాలను దురుద్దేశంతో తీసుకున్నారు. ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్‌ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా లోతైన విచారణ జరిపిన తర్వాత ఏసీబీ పిటిషనర్‌పై కేసు నమోదు చేసింది

నియామకం వెనక కుట్ర? విజయ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగి కాదు. భారత సమాచార సేవల అధికారిగా ఉన్న ఆయనను 2019లో డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్‌గా, సాధారణ పరిపాలనశాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్‌గా ప్రతిపాదలను పంపడం, సాధారణ పరిపాలనశాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా వాటికి ఆయనే ఆమోదం తెలుపుతూ ద్విపాత్రాభినయం చేశారు. విజయ్‌కుమార్‌రెడ్డిని రాష్ట్రానికి తీసుకురావడం వెనుక ఏమైనా కుట్ర దాగుందా? ఇక్కడికి ఎవరు తెచ్చారు? ఎందుకు తెచ్చారు? తదితర విషయాలన్ని దర్యాప్తులో తేలాల్సి ఉంది. పిటిషనర్‌ అవినీతికి పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి.

విచారణ 27 కు వాయిదా:ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రస్తుతం దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. ఈ దశలో బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కస్టోడియల్‌ ఇంట్రాగేషన్‌ అవసరం. ముందస్తు బెయిలు పిటిషన్​ను కొట్టేయండని ఏజీ శ్రీనివాస్‌ కోరారు. గురువారం జరిగిన విచారణలో ఏసీబీ తరపు వాదనలు ముగిశాయి. న్యాయస్థానం లేవనెత్తిన అంశాలపై స్పష్టత, పిటిషనర్‌ తరపు న్యాయవాది రిప్లై వాదనల కోసం విచారణ ఈనెల 27కు వాయిదా పడింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గురువారం ఉత్తర్వులిచ్చారు.

జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ అలాస్యానికి కారణమెంటీ : సుప్రీం కోర్టు

ఇక నుంచి సీబీఐ కోర్టులో జగన్ కేసుల రోజువారీ విచారణ: తెలంగాణ హైకోర్టు ఆదేశం - HIGH COURT HEARING JAGANS CASES

ఓ యూట్యూబ్‌ ఛానల్‌ బాధ్యతా రాహిత్యం వల్లే ఈ పరిస్థితి : బోరుగడ్డ

ABOUT THE AUTHOR

...view details