Kodi Kathi Case Updates : ఏపీలో సంచలనం రేపిన కోడికత్తి ఘటన విశాఖ విమానాశ్రయంలో జరిగి ఆరుసంవత్సరాలు అవుతోంది. ఓ పెద్ద హైడ్రామాగా మారిన ఈ కేసును వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల్లో ప్రచారాంశంగా మార్చుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీను విచారణ ఖైదీగా జైల్లో మగ్గి బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రస్తుతం రెగ్యులర్ వాయిదాలకు విశాఖ ఎన్‌ఐఏ కోర్టుకు హాజరవుతున్నారు. ఈ కేసు నవంబర్ 15కు వాయిదా పడింది. విచిత్రమేమంటే ఈ కేసులో బాధితుడుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కసారి కూడా న్యాయస్థానంలో విచారణకు హాజరు కాకపోవడం.
ఏం జరిగిందంటే? :వైఎస్ జగన్ 2018 అక్టోబర్ 25న హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీఐపీ లాంజ్‌లో ఉండగా సెల్ఫీ తీసుకుంటానంటూ జనపల్లి శ్రీను వచ్చి, కోడి కత్తితో దాడి చేశారంటూ వైఎస్సార్సీపీ నేతలు హడావుడి చేశారు. భుజానికి చిన్న గాయం అయిందంటూ వెంటనే విమానంలో జగన్ హైదరాబాద్ వెళ్లారు. అక్కడ లోటస్ పాండ్‌కు దగ్గరగా ఉన్న ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే శ్రీను జగన్ వీరాభిమాని అని, ఆయనపై సానుభూతి రావాలనే దాడి చేసినట్లు అప్పట్లో పోలీసులు తేల్చారు.
ఎన్నో మలుపుల మధ్య విశాఖకు చేరిన కేసు :ఈ కేసుపై దర్యాప్తునకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేదని వైఎస్ జగన్ ఎన్‌ఐఏ విచారణ చేయాలని కోరారు. 2019లో ఎన్‌ఐఏ ఛార్జిషీటు దాఖలు చేసినా విచారణకు వచ్చేందుకు జాప్యమైంది. జనపల్లి శ్రీనుకు 2019 మే 22న బెయిల్ రాగా, ఆగస్టు 13న మళ్లీ జైలుకు సరెండర్ అయ్యారు. కారణం ఆ బెయిల్‌ను ఎన్‌ఐఏ న్యాయస్థానంలో కొట్టి వేయించడమే. అప్పటి నుంచి బెయిల్ పిటిషన్‌పై విజయవాడ న్యాయస్థానంలో వాదనలు జరగుతున్నాయి.
ఈ క్రమంలోనే కోడికత్తి కేసును అనూహ్యంగా విజయవాడ నుంచి 2023 ఆగస్టు 30న విశాఖ ఎన్‌ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారు. అదే సమయంలో రాజమహేంద్రవరం కారాగారం నుంచి విశాఖ న్యాయస్థానానికి రావడానికి ఇబ్బందులున్నాయని, విశాఖ కేంద్ర కారాగారానికి శ్రీనును మార్చాలంటూ నిందితుడి తరఫు న్యాయవాది కోరడంతో కోర్టు అంగీకరించింది. 2023 సెప్టెంబర్ నుంచి శ్రీను విశాఖ కేంద్ర కారాగారంలో మగ్గుతూ, 2024 ఫిబ్రవరిలో బెయిల్‌పై బయటకు వచ్చారు.