EX CM Jagan Tirumala Tour :వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన చేసిన ప్రతి సారీ వివాదాస్పదం అవుతోంది. గతంలో సీఎం హోదాలో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ నిరసన గళాలను తొక్కిపెట్టి తిరుమలలో పర్యటించారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించారు. దీనిపై హిందూ వాదులు, సాధు సంతుల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. పాదయాత్ర ప్రారంభానికి ముందు పాదయాత్ర ముగిసిన తర్వాత తిరుమల వచ్చిన జగన్, తన మందీ మార్భలంతో చేసిన హంగామా అప్పట్లో వివాదాస్పదమైంది.
Jagan Declaration Issue :తిరుమల గిరులను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరు మాడవీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో పాదరక్షలు లేకుండా నడుస్తారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే క్యూ కాంప్లెక్స్‌లోకి గతంలో జగన్ ఏకంగా పాదరక్షలతో ప్రవేశించడం తీవ్ర వివాదాస్పదమైంది. తిరుమలలో పార్టీలు, వ్యక్తులకు అనుకూలంగా నినాదాలు చేయడం నిషేధం. కానీ జగన్ పర్యటించిన ప్రతిసారీ మాడవీధులు, క్యూ కాంప్లెక్స్‌లో జై జగన్ అంటూ అనుచరులు నినాదాలు చేసినా, వారిని ఏ రోజూ వారించిన పాపాన పోలేదు.
గోవింద నామస్మరణల్లో జగన్ పేరు :గోవింద నామస్మరణలు మినహా మరే పదం వినిపించకూడని ప్రాంతంలో తన పేరున నినాదాలు చేసే అనుచరులను ఆపకపోగా చిద్విలాసంతో వారిని మరింత ప్రోత్సహించేలా వ్యవహరించడం హిందూవాదులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా తిరుమల పర్యటనలను ఇష్టారీతిన సాగించిన జగన్, సీఎంగా ఉన్న సమయంలో మరింత అధికార దర్పాన్ని ప్రదర్శించారు. సంప్రదాయాలు, నిబంధనలు తనకేమీ వర్తించవన్న రీతిలో వ్యవహరించారు. శ్రీవారి ఆలయంలో తులాభారం చేసే సమయంలో జగన్ పిన్నమ్మ, అప్పటి టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య గోవింద నామస్మరణల్లో జగన్ పేరు కలిపి స్మరించడం తీవ్ర వివాదాస్పదమైంది.